రానున్న ప్రపంచకప్ కోసం బలమైన జట్టును నిర్మించుకునే ప్రయత్నంలో భాగంగా.. ఆసియా కప్‌లో భారత్ భిన్న కూర్పులను ప్రయత్నించింది. కొందరిని పక్కనపెట్టి మరికొందరికి అవకాశమిచ్చింది. కానీ ఈ మార్పులు టీమ్‌ఇండియాకు మంచి ఫలితాలను ఇవ్వలేదు. పాకిస్థాన్, శ్రీలంక చేతిలో ఓటమితో ఫైనల్‌కు చేరుకోకుండానే జట్టు ఇంటిముఖం పట్టింది. అయితే, ఆసియా కప్‌లో చేపట్టిన మార్పులపై టీమ్‌ఇండియా మాజీ సెలక్టర్ దిలీప్ వెంగ్‌సర్కార్ స్పందిస్తూ.. ఈ నిర్ణయాన్ని తప్పుబట్టారు. పలు జట్లు పాల్గొనే ఇలాంటి పెద్ద టోర్నీలో ఈ తరహా ప్రయత్నాలు చేయడం సరికాదన్నారు. పెద్ద టోర్నీల్లో గెలవడం జట్టు నైతికతకు కీలకమన్నారు.
'జట్టు కూర్పులో పలు మార్పులు చేసుకుంటూ పోయారు. దినేశ్ కార్తీక్‌కు ఎంపిక చేసినా.. అతడు ఆడేందుకు పెద్దగా అవకాశాలివ్వలేదు. రవిచంద్రన్ అశ్విన్‌కు మొదటిసారి శ్రీలంకతో ఆడే అవకాశం ఇచ్చారు. ప్రపంచకప్ కోసం ఉత్తమ టీమ్ XIను గుర్తించే పనిలో భాగంగా ఇలా చేశారని తెలుస్తోంది. కానీ ఈ టోర్నీ కూడా చాలా ముఖ్యమే కదా. ఆసియా కప్ ఓ పెద్ద టోర్నమెంట్' అని మాజీ సెలక్టర్ వ్యాఖ్యానించారు.