తెలంగాణ

telangana

ETV Bharat / sports

Imran Tahir South Africa : కుర్రాళ్లకు దీటుగా రాణిస్తున్న క్రికెటర్​.. నాలుగు పదుల వయసులో ధోనీ రికార్డు బ్రేక్​!

Imran Tahir South Africa : అతడికి 44 ఏళ్లు. అయినప్పటికీ.. కుర్రాళ్లకు దీటుగా క్రికెట్​లో రాణిస్తున్నాడు. బాల్​ చేతపట్టి ప్రత్యర్థులను హడలెత్తిస్తున్నాడు. నాలుగు పదుల వయసులో సారథ్య బాధ్యతలు స్వీకరించి.. ఓ జట్టును విజయపథంలోకి నడిపించాడు. అతడే దక్షిణాఫ్రికా మాజీ లెగ్‌ స్పిన్నర్‌ ఇమ్రాన్‌ తాహిర్‌. ఐపీఎల్​ లవర్స్​కు సుపరిచితుడైన ఈ స్టార్​ ప్లేయర్​.. తాజాగా జరిగిన కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో అమెజాన్‌ వారియర్స్‌ను గెలిపించి తనకు వయసు అడ్డంకి కాదని నిరూపించాడు. ఈ క్రమంలో ఆయన పలు రికార్డులను కూడా బద్దలు కొట్టాడు. ఇంతకీ అవేంటంటే..

South Africa Player Imran Tahir
South Africa Player Imran Tahir

By ETV Bharat Telugu Team

Published : Sep 29, 2023, 4:05 PM IST

Imran Tahir South Africa : ఆ క్రికెటర్వయసు 44 ఏళ్లు. మామూలుగా చూస్తే.. అతడు ఆ ఏజ్​కి ఏదైనా జట్టుకు కోచ్‌గా ఉండచ్చు. లేకుంటే రిటైర్మంట్​ లైఫ్​ను గడుపుతూ ఇంటి దగ్గర విశ్రాంతి తీసుకుంటారు. కానీ అతడు అలా చేయలేదు. ఓ పెద్ద టోర్నీలో ఒక జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించడమే కాకుండా ఆ టీమ్​ కోసం ఏకంగా టైటిల్‌ కూడా సాధించిపెట్టాడు. అలా వయసు అనేది కేవలం ఒక నంబర్‌ మాత్రమే అని రుజువు చేశాడు. అతడే దక్షిణాఫ్రికా మాజీ లెగ్‌ స్పిన్నర్‌ ఇమ్రాన్‌ తాహిర్‌. తాజాగా జరిగిన కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్​లో అమెజాన్‌ వారియర్స్‌ జట్టును విజేతగా నిలిపాడు. ఓ కెప్టెన్‌గానే కాదు బౌలర్‌గానూ రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

కుర్రాళ్లకు దీటుగా..
Imran Tahir Stats : మూడేళ్ల క్రితమే తాహిర్‌.. జట్టుకు వీడ్కోలు పలికాడు. ఐపీఎల్​లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరఫున ఆడినప్పటికీ.. ఆ తర్వాత అతడు ఎక్కడా కనబడలేదు. తాహిర్‌ కోచ్‌గానో లేదా మార్గదర్శకుడిగా అవతారం ఎత్తి ఉంటాడని అనుకున్నారు. కానీ నాలుగు పదుల వయసులోనూ తాహిర్‌ ఓ యాక్టివ్‌ క్రికెటర్‌గా కొనసాగుతున్నాడు. అదీ యువ ఆటగాళ్లు ఉండే టీ20 క్రికెట్​లో! పొట్టి క్రికెట్‌ అంటే మైదానంలో చాలా ఫాస్ట్‌గా ఉండాలి. బ్యాటింగ్‌ కాకుంటే బౌలింగ్‌లోనైనా అదరగొట్టాలి. కానీ ఈ వెటరన్‌ ప్లేయర్​.. తనను తాను ఫిట్‌గా ఉంచుకోవడమే కాకుండా బౌలింగ్‌లో పదును తగ్గకుండా సాగుతున్నాడు.

ధోని రికార్డు బద్దలు కొట్టి..
నాలుగు పదుల వయసులో క్రికెట్ కొనసాగడమే ఎక్కువ అని అనుకుంటే.. తాహిర్​ అక్కడ రాణించడమే కాకుండా పలు రికార్డులను కూడా బద్దలుకొడుతున్నాడు. తాజాగా కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్ ఇందుకు నిదర్శనం. ఓ బౌలర్‌గానే కాకుండా కెప్టెన్‌గానూ అమెజాన్‌ వారియర్స్‌ జట్టును ముందుండి నడిపించి విజయ తీరాలకు చేర్చాడు. ఈ క్రమంలో ఒక టీ20 లీగ్‌ను గెలిపించిన పెద్ద వయస్కుడైన కెప్టెన్‌గా కూడా నయా రికార్డును సృష్టించాడు. తాహిర్‌ సారథ్యంలో లీగ్‌ దశలో జరిగిన 10 మ్యాచ్‌ల్లో వారియర్స్‌.. ఎనిమిదింట్లో విజయాలను అందుకుంది. ఇక 41 ఏళ్ల ధోని ఈ ఏడాది ఐపీఎల్‌లో చెన్నైను విజేతగా నిలబెట్టడం ప్రస్తుతం రికార్డుగా ఉంది. అయితే ఈ రికార్డును తాహిర్‌ నాలుగు నెలల్లోనే బద్దలు కొట్టాడు.

బౌలర్‌గానూ అదరగొట్టి
కెప్టెన్‌గా సీపీఎల్‌లో జట్టును గొప్పగా నడిపించిన తాహిర్‌.. కీలక సమయాల్లో తన బౌలింగ్​ స్కిల్స్​ను కనబరిచి అదరగొట్టాడు. ఆడిన 13 మ్యాచ్‌ల్లో 18 వికెట్లు తీసిన ఈ లెగ్‌స్పిన్నర్‌.. అత్యధిక వికెట్లు తీసిన ప్లేయర్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. పొదుపుగా బౌలింగ్‌ చేసిన ఈ వెటరన్‌ 6.22 ఎకానమీని నమోదు చేయడం విశేషం.

ఫైనల్​ 4 ఓవర్లలో కేవలం 8 పరుగులే ఇచ్చిన తాహిర్‌..డ్వేన్‌ బ్రావో, ఆండ్రూ రసెల్, వికెట్లు తీసి సత్తా చాటాడు. ఫైనల్లో అమెజాన్‌ వారియర్స్‌ కప్‌ గెలిచిన తర్వాత తాహిర్‌ ఉద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్నాడు. తన వయసు గురించి అందరూ మాట్లాడారని.. తనపై డబ్బులు పెట్టడం వృథా అని విమర్శించారని.. కానీ ఆ విమర్శలు తప్పని నిరూపించినట్లు తాహిర్‌ ఉద్వేగంగా చెప్పాడు.

తాహిర్‌ ఉత్సాహమే వేరు
అయితే వికెట్‌ తీయగానే ఫుట్‌బాల్‌ ఆటగాడి మాదిరిగా చేతులు చాచి ఛాతిపై చరుచుకుంటూ మైదానంలో చాలా దూరం పరుగెత్తి తాహిర్‌ చేసుకునే సెలబ్రేషన్స్‌ భలే ఉంటాయి. అంతర్జాతీయ క్రికెట్లో మాత్రమే కాక ఐపీఎల్‌లోనూ అతడు ఇలాగే సంబరాలు చేసుకునేవాడు. కరీబియన్‌ ప్రిమియర్‌ లీగ్‌లో తమ జట్టు టైటిల్‌ గెలిచిన తర్వాత కూడా తాహిర్‌ చిన్న పిల్లాడిలా మారి సంబరాలు చేసుకున్నాడు. అడ్డంకులు దాటుకుని.. విమర్శలను ఎదుర్కొని టైటిల్‌ను అందించి శభాష్‌ అనిపించాడు. కరీబియన్‌ ప్రిమియర్‌ లీగ్‌ కప్‌ గెలిచిన ఉత్సాహంతో మరింత కాలం ఆడతానని అంటున్న తాహిర్‌ మున్ముందు ఎలా రాణిస్తాడో చూడాలి.

'తాహిర్.. రియల్ ఛాంపియన్ ఆఫ్ క్రికెట్'

ఐపీఎల్ 2021: ఫ్రాంచైజీల వారిగా చిన్నోడు-పెద్దోడు!

ABOUT THE AUTHOR

...view details