గతేడాది జరిగిన ఆసియా కప్, టీ20 ప్రపంచకప్‌ల్లో టీమ్‌ఇండియా పేలవ ప్రదర్శన చేసింది. జట్టు ఎంపిక సరిగ్గా లేదని, ఆటగాళ్లకు అవకాశాలు దక్కలేదనే అపవాదులను బీసీసీఐ మూటగట్టుకొంది. దీంతో భారత్ వేదికగానే జరిగే వన్డే ప్రపంచకప్ కోసం బీసీసీఐ ముందస్తుగానే కసరత్తు మొదలుపెట్టింది. జట్టు ఎంపిక కోసం ఇప్పటికే 20 మంది ఆటగాళ్లతో షార్ట్‌లిస్ట్‌ని రూపొందించింది. అయితే, ఆ లిస్ట్‌లో ఉన్న ఆటగాళ్ల పేర్లను మాత్రం అధికారికంగా వెల్లడించలేదు. కానీ, బీసీసీఐ అనుసరించబోయే విధానం ద్వారా ఆటగాళ్ల ఎంపిక ఉంటుందనే చర్చ జరుగుతోంది. ఇదే అంశంపై జరిగిన డిబేట్‌లో భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ మాట్లాడాడు. ఒక ఆటగాడిని మరొక ఆటగాడిలా ఆడమని అడగకూడదని, ఆటగాళ్ల ఎంపికలో జట్టు అనుసరించే విధానమే ప్రధాన పాత్ర పోషిస్తుందని పేర్కొన్నాడు.
'కోహ్లీని అలా ఆడమని అడిగితే ఆడలేడు!' - బీసీసీఐపై గౌతమ్ గంభీర్ కామెంట్స్
ఈ ఏడాది వన్డే ప్రపంచకప్ జరగనున్న తరుణంలో జట్టులోని ప్లేయర్ల ఎంపికపై బీసీసీఐ ఇప్పటినుంచే దృష్టిసారించింది. అయితే టీమ్ మెంబర్స్‌ను సెలెక్ట్ చేసే సమయంలో దూకుడుగా ఆడే ఆటగాళ్లను గుర్తించి ఎంపిక చేయాలని భారత మాజీ క్రికెటర్ గంభీర్ సూచించాడు. ఆయన అలా ఎందుకు అన్నాడంటే ??
" మొదట దూకుడుగా ఆడుతున్న ఆటగాళ్లను గుర్తించాలి. వన్డే ఫార్మాట్‌కు ఎంపికలో వైవిధ్యం ఉండాలి. మేం క్రికెట్ ఆడినప్పటితో పోల్చితే ఇప్పుడు చాలా మార్పులు వచ్చాయి. అప్పుడు కొత్త బంతి ఒక్కటి మాత్రమే ఉండేది. రెండు కొత్త బంతులు వచ్చాయి. ఇప్పుడు 30 యార్డ్ సర్కిల్ లోపల ఐదుగురు ఫీల్డర్‌లు ఉంటున్నారు. కాబట్టి.. పార్ట్‌టైమ్ బౌలర్ పాత్ర పరిమితమైంది. ఇకపై రివర్స్ స్వింగ్‌లు కూడా తగ్గిపోతాయి. మణికట్టు స్పిన్నర్ల ప్రభావం కూడా పెద్దగా ఉండదు. ఆటలో కొత్తగా వచ్చిన మార్పులను సులభంగా స్వీకరించే ఆటగాళ్లను గుర్తించాలి" అని గంభీర్ తెలిపాడు.
"నేను యూసుఫ్ పఠాన్‌లా ఆడలేను. నేను ఆడినట్టు అతడు ఆడలేడు. ఒకవేళ ఎవరైనా నన్ను యూసుఫ్ ఆటతీరును అనుసరించమని అడిగితే నేను దాన్ని చేయలేను. అతడిని కూడా ఎవరైనా నా ఆటతీరును అనుసరించాలని చెబితే చేయలేడు. అందుకే ఆటగాళ్ల గుర్తింపు చాలా ముఖ్యం. ఒకవేళ మీరు కోహ్లీని సూర్యకుమార్ యాదవ్‌లా ఆడాలని చెబితే అతడు ఆడలేడు. సూర్యను కోహ్లీలా ఆడమని చెబితే ఆడలేడు" అని గంభీర్ పేర్కొన్నాడు. స్పిన్ బౌలింగ్‌ను బాగా ఎదుర్కొనే సత్తా ఉన్న విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మవంటి అనుభవజ్ఞులు 2023 వన్డే ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా తరఫున కీలకపాత్ర పోషిస్తారని అభిప్రాయపడ్డాడు.