India Pak Match Hotel Charges : వన్డే ప్రపంచకప్‌లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ అంటేనే అంచనాలు ఆకాశాన్ని తాకుతాయి. ఐసీసీ ఈవెంట్‌లలో మాత్రమే ఎప్పుడో ఓసారి తలపడే దాయాదుల పోరును చూసేందుకు అభిమానులు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తుంటారు. అలాంటిది క్రికెట్‌ను అమితంగా ప్రేమించే మన దేశంలో అదీ ప్రపంచకప్ లాంటి మెగా ఈవెంట్‌లో భారత్-పాక్ తలపడుతుంటే చూస్తూ ఊరుకుంటారా. అందుకే మ్యాచ్‌కు సుమారు 90 రోజుల ముందే హోటల్ బుకింగ్‌లు జోరందుకున్నాయి. ఈ మెగా మ్యాచ్ జరిగే గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో వేలల్లో ఉన్న హోటల్ రూమ్ అద్దెలు లక్షల్లోకి చేరిపోయాయి. భారత్ పాక్ మ్యాచ్ జరిగే అక్టోబర్ 15న అహ్మదాబాద్‌లోని హోటల్‌లో బస చేయాలంటే మన దగ్గర లక్ష రూపాయలు ఉండాల్సిందే. అక్టోబర్ 15వ తేదీన అహ్మదాబాద్‌లో హోటల్ గదుల అద్దె ధరలు దాదాపు పది రెట్లు పెరిగాయి.
ICC World Cup 2023 : వరల్డ్ కప్ ఎఫెక్ట్.. ఒక్కరోజుకు లక్షల్లో ఛార్జీలు! - అహ్మదాబాద్‌లో పెరిగిన హోటల్ ఛార్జీలు
ICC World Cup 2023 Effect On October 15 : భారత్-పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ అంటే నరాలు తెగే ఉత్కంఠ ఉంటుంది. ఇరు దేశాల అభిమానులు దానిని మ్యాచ్‌లా కాకుండా ఓ యుద్ధంలా చూస్తారు. అయితే దాయాదుల మధ్య జరిగే అలాంటి హైఓల్టేజ్ మ్యాచ్‌ను ప్రత్యేక్షంగా చూసేందుకు క్రికెట్ ప్రేమికులు ఉవ్విళ్లూరుతుంటారు. ఇందుకోసం మ్యాచ్‌లు జరిగే నగరాల్లో బస చేసేందుకు కూడా పోటీలు పడుతుంటారు. అయితే ఈ మెగా మ్యాచ్‌కు మూడు నెలల సమయం మిగిలి ఉన్నా ఇప్పటినుంచే మ్యాచ్ జరిగే ప్రధాన నగరాల్లో హోటల్ బుకింగ్స్ సందడి మొదలైంది. దీనిని ఆసరా చేసుకుంటున్న కొందరు హోటల్ నిర్వాహకులు అద్దె ధరలను దాదాపు పది రెట్లు పెంచేశారు. ఆ వివరాలు..
భారీగా పెంచేశారు..
India Pak Match Hotel Packages : భారత్-పాక్ మ్యాచ్‌కు మూడు నెలల ముందే అహ్మదాబాద్‌లోని హోటల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటితో పోలిస్తే అక్టోబర్ 15 నాటికి దాదాపు 10 రెట్లు హోటల్ ఛార్జీలు పెరిగాయి. కొన్ని హోటళ్లు అక్టోబర్ 15న ఒక్కరోజు బస చేసేందుకు లక్ష రూపాయల వరకు వసూలు చేస్తున్నాయి. ఇప్పటికే చాలా వరకు భారత్- పాక్ మ్యాచ్ జరిగే రోజు హోటల్ గదులు బుక్ అయ్యాయని నిర్వాహకులు చెబుతున్నారు. అయితే అహ్మదాబాద్‌లోని విలాసవంతమైన హోటళ్లలో ప్రసుతం ఒక్కరోజు హోటల్ గది అద్దె రూ.5 వేల నుంచి రూ.8 వేల వరకు ఉండగా.. అక్టోబర్ 15 నాటికి ఇది రూ.40 వేల నుంచి లక్ష రూపాయలకు పెరిగింది. అహ్మదాబాద్‌లోని వెల్‌కమ్ హోటల్‌లో జులై 2న ఒక డీలక్స్ గది అద్దె రూ.5,700 ఉండగా.. ఇదే హోటల్ అక్టోబర్ 15వ తేదీన ఒక రోజు ఉండాలనుకుంటే రూ.72 వేల రూపాయలు చెల్లించాల్సిందేనని హోటల్ పోర్టల్ బుకింగ్ డాట్ కామ్ వెల్లడించింది.
రూ.3 వేల నుంచి రూ.30 వేలకు..!
ICC World Cup 2023 Effect On October 15 : రినైసెన్స్ అహ్మదాబాద్ హోటల్లో ప్రస్తుతం ఒక్కరోజు అద్దె రూ.8 వేలుగా ఉంది. ఇదే ధర అక్టోబర్ 15 నాటికి రూ.90 వేలకు చేరింది. మరో హోటల్ ప్రైడ్ ప్లాజా భారత్-పాక్ మ్యాచ్ రోజు గది అద్దెను రూ.37 వేలకు పెంచింది. ఇంకా అహ్మదాబాద్‌లో రోజుకు రూ.3 వేల రూపాయలు వసూలు చేసే హోటళ్లు అక్టోబర్ 15న రూ.27 వేల రూపాయలు వసూలు చేస్తున్నాయి. అహ్మదాబాద్‌లోని అన్ని ఫైవ్ స్టార్ హోటళ్లలో అక్టోబర్ 15న గదులు బుక్ అయ్యాయి. ప్రవాస భారతీయులు ఎక్కువగా హోటల్ గదులు బుక్ చేసుకున్నట్లు సమాచారం. అహ్మదాబాద్‌లోని బడ్జెట్ హోటళ్లలో ధరల పెరుగుదల కనిపించలేదు. మధ్య తరగతి క్రికెట్ అభిమానులు మ్యాచ్ జరిగే రోజే అహ్మదాబాద్ చేరుకుంటారని.. వారికి హోటల్లో ఉండే ఉద్దేశం ఉండదని హోటల్ నిర్వాహకులు తెలిపారు.