World Cup Final 2023 :ఐసీసీ ప్రపంచకప్ ముగింపు దశకు చేరింది. విశ్వవిజేత ఎవరనేది మరో రెండు రోజుల్లో తేలనుంది. భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగే పోరు కోసం సర్వం సిద్ధమైంది. అయితే, అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ మ్యాచ్ కోసం ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది బీసీసీఐ. ముగింపు వేడుకలను అదే స్థాయిలో నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అహ్మదాబాద్ వేదికగా జరిగే ఫైనల్ మ్యాచ్‌కు పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు.
వాయు సేన విన్యాసాలు ఫైనల్‌కు అదనపు ఆకర్షణగా నిలవన్నాయి. భారత వైమానిక దళానికి చెందిన సూర్య కిరణ్ విమానాలు నరేంద్ర మోదీ స్టేడియంపై విన్యాసాలు నిర్వహించనున్నాయి. ఫైనల్ ఆరంభమయ్యే పది నిమిషాల ముందు నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ విన్యాసాలు అభిమానులను అలరించనున్నాయి. అందుకు సన్నాహకంగా సూర్యకిరణ్ విమానాలు శుక్రవారం రిహార్సల్స్ నిర్వహించాయి. 9 విమానాలు ఈ రిహార్సల్స్‌లో పాల్గొన్నాయి. స్టేడియం చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసిస్తున్న వారు సూర్యకిరణ్ విమానాల విన్యాసాలను ఆసక్తిగా తిలకించారు. ఈ ఐకానిక్ స్టేడియం పక్కనే నివాసం ఉండటం తమ అదృష్టమని వారన్నారు.
భారత ప్రధాని, ఆసీస్ డిప్యూటీ ప్రధాని హాజరు
ఈ ఫైనల్ మ్యాచ్‌ను వీక్షించేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ సైతం హాజరు కానున్నారు. ఆయనతో పాటు ఆస్ట్రేలియా డిప్యూటీ ప్రధాని రిచర్డ్స్ మార్లెస్ సైతం రానున్నారు. ఈ మేరకు గుజరాత్ హోమంత్రిత్వ శాఖ ఉన్నతాధికారి వెల్లడించారు.