World Cup Final 2023 : విశ్వవిజేత ఎవరనేది మరి కొద్ది గంటల్లో తేలనుంది. ప్రపంచకప్ ఫైనల్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. మ్యాచ్ కోసం ఇరు జట్లు ఇప్పటికే అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియానికి చేరుకున్నాయి. ఈ క్రమంలోనే గుజరాత్‌కు చెందిన ఓ బీజేపీ నేత టీమ్ఇండియాకు అదిరిపోయే ఆఫర్ ఇచ్చారు. ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగే ఫైనల్ మ్యాచ్‌లో విజయం సాధిస్తే.. జట్టులోని సభ్యులకు ప్లాట్లు బహుమతిగా ఇస్తానని ప్రకటించారు కెయూర్ ధోలారియా.
రాజ్‌కోట్‌లోని భయసార్- ఖథ్రోట్ శివరామ్ జెమినీ ఇండస్ట్రీస్ జోన్‌లోని 16 ప్లాట్లను ఇస్తానని చెప్పారు ధోలారియా. 15 జట్టలు సభ్యులతో పాటు కోచ్ ద్రవిడ్‌కు ఈ ప్లాట్లను ఇస్తానని వివరించారు. రూ. 10 లక్షల విలువైన ఈ ప్లాట్లలో అన్ని సదుపాయలను కల్పించామని చెప్పారు. ఈ విషయంపై బీసీసీఐని సైతం సంప్రదిస్తున్నామని తెలిపారు. ఎవరైనా క్రికెటర్లు.. ఈ ప్లాట్లను తమ కుటుంబ సభ్యులకు బదిలీ చేయాలని కోరినా చేస్తామన్నారు. 230 ప్లాట్లు కలిగిన ఈ వెంచర్లో 16 ప్లాట్లను ఇప్పటికే క్రికెటర్ల కోసం రిజర్వ్ చేశామని చెప్పారు.
ఫైనల్ కోసం ఘనంగా ఏర్పాట్లు
ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు బీసీసీఐ ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేసింది. టాస్ వేసిన అనంతరం 1: 35 గంటల నుంచి 1:50 వరకు భారత వాయుసేన ఆధ్వర్యంలోని సూర్యకిరణ్ ఎయిర్‌బాటిక్ బృందం ఎయిర్‌షో కార్యక్రమం ఉంటుంది. మొదటి ఇన్సింగ్స్ డ్రింక్స్ విరామంలో ప్రముఖ నేపథ్య గాయకుడు, గేయ రచయిత ఆదిత్య గద్వీతో సంగీత కార్యక్రమం, తొలి ఇన్నింగ్స్ విరామ సమయంలో ప్రీతమ్, తుషార్ జోషీ, జోనితా గాంధీ తదితరుల నేతృత్వంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. రెండో ఇన్నింగ్స్ విరామ సమయంలో లేజర్, లైట్ షో ఉండనుంది. ఈ మ్యాచ్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం హాజరు కానున్నారు.