World Cup 2023 Pak Vs Aus : 2023 ప్రపంచకప్‌లో భాగంగా బెంగళూరు వేదికగా జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై.. ఆస్ట్రేలియా 62 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. పాక్ ముంగిట 368 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఇక భారీ లక్ష్య ఛేదనలో పాక్.. 45.3 ఓవర్లలో 305 పరుగులు చేసి ఆలౌటైంది. ఓపెనర్లు షఫిక్ (64), ఇమామ్ ఉల్ హక్ (70) హాఫ్ సెంచరీలు సాధించారు. రిజ్వాన్ (46), సౌథ్ షకీల్ (30) మాత్రమే రాణించారు. ఆసీస్ బౌలర్లలో ఆడమ్ జంపా మరోసారి 4 వికెట్లతో మెరిశాడు. కెప్టెన్ ప్యాట్ కమిన్స్ 2, స్టోయినిస్ 2, జోష్ హజెల్‌వుడ్, మిచెల్ స్టార్క్ తలో వికెట్ పడగొట్టారు. సూపర్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న ఆసీస్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ (163 పరుగులు) కు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు లభించింది. ఈ గెలుపుతో ఆసీస్ టోర్నీలో రెండో విజయాన్ని నమోదు చేయగా.. పాకిస్థాన్ రెండో పరాజయాన్ని చవిచూసింది.
ఆసీస్ అదరహో..టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్.. భారీ స్కోర్ నమోదు చేసింది. ఓపెనర్లు డేవిడ్ వార్నర్ ( 163 పరుగులు,124 బంతుల్లో 14×4, 9×6), మిచెల్ మార్ష్ (121 పరుగులు, 108 బంతుల్లో 10×4, 9×6) శతకాలతో పాక్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. వీరిద్దరూ ఆరంభం నుంచే వారిపై ఎదురుదాడికి దిగారు. పోటీపడి మరీ బంతిని బౌండరీ దాటించారు. ఈ ద్వయం తొలి వికెట్‌కు 259 పరుగులు జోడించింది. ఇక 33.5 ఓవర్ వద్ద మార్ష్ ఔటవ్వగా.. 42.2 ఓవర్ వద్ద వార్నర్ పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత వచ్చిన ఏ బ్యాటర్‌నీ పాక్ బౌలర్లు క్రీజులో కుదురుకోనీయలేదు. వరుసగా మ్యాక్స్ వెల్ (0), స్టీవ్ స్మిత్ (7), స్టొయినిస్ (21), జోష్ లింగ్స్ (13), లబుషేన్ (8), స్టార్క్ (2), హేజిల్ వుడ్ (0) పెవిలియన్‌కు క్యూ కట్టారు. దీంతో ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 367 పరుగులు చేసింది. పాక్ బౌలర్లలో షాహీన్ అఫ్రిది 5, హారిస్ రౌఫ్ 3, ఉస్మాన్ మీర్ ఒక వికెట్ పడగొట్టారు.