Wasim Akram on Babar : ప్రపంచకప్లో భారత్ చేతిలో పాకిస్థాన్ పరాజయంపై ఆ జట్టు మాజీ కెప్టెన్లు విమర్శలు చేస్తున్నారు. మ్యాచ్ ముగిశాక భారత్ స్టార్ విరాట్ కోహ్లీ నుంచి పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ జెర్సీలు తీసుకోవడాన్ని ఆ జట్టు మాజీ కెప్టెన్ వసీమ్ అక్రమ్ తప్పుబట్టాడు. మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ, బాబర్ గ్రౌండ్లో ముచ్చటించారు. ఆ సందర్భంగా టీమిండియా జెర్సీని కోహ్లీ నుంచి బాబర్ తీసుకున్నాడు. దీనిపై మాజీ కెప్టెన్ వసీమ్ అక్రమ్ అందరి ముందు అలా తీసుకోవటం ఆశ్యర్యం కలిగించిందని అన్నాడు. "మ్యాచ్ పరాజయంతో పాక్ ఫ్యాన్స్ అంతా విచారంలో ఉంటే.. బాబార్ కోహ్లీ ఇచ్చిన జెర్సీని అలా తీసుకోవటం సరైనది కాదు. మీ అంకుల్ కుమారుడు.. కోహ్లీ జెర్సీ కావాలని అడిగి ఉంటే.. డ్రెసింగ్ రూమ్లో తీసుకొని ఉండాల్సింది. ఇలా బహిరంగా కాదు" అని వసీమ్ అక్రమ్ విమర్శించాడు.
ప్రపంచకప్లో భారత్ చేతిలోపాకిస్థాన్ పరాజయం తనకు చాలా బాధ కలిగిస్తోందని ఆ జట్టు మాజీ కెప్టెన్ రమీజ్ రజా అన్నాడు. "ఇదో పెద్ద మచ్చలాగా మిగిలిపోతుంది. అన్ని విభాగాల్లోనూ పాక్ దారుణంగా విఫలమైంది. గెలుపును పొందలేని పరిస్థితి లేనప్పుడు కనీసం పోటీ ఇవ్వాలి. పాక్ కనీసం ఆ పని కూడా చేయలేకపోయింది. భారత్కు అభిమానుల మద్దతు భారీగానే ఉంటుంది. ఆ ఒత్తిడిని తట్టుకుని గెలవాలి లేదా పోటీ ఇవ్వాలి. భారత్లో ఆడేటప్పుడు 'చోకర్స్' అని అనిపించుకోవటం పాక్కు మంచిది కాదు. ఇండియా జట్టుకు ఈ మ్యాచ్ అంత తేలికేం కాలేదు". అని రమీజ్ రజా పేర్కొన్నాడు.