Sri Lanka Cricket Board Sacked By Government : శ్రీలంక క్రికెట్ బోర్డును రద్దు చేస్తూ ఆ దేశ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పుడున్న క్రికెట్ బోర్డును (ఎస్ఎల్సీబీ) రద్దు చేస్తున్నట్లు క్రీడా మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ మేరకు క్రీడల మంత్రి రోషన్ రణసింఘే వెల్లడించారు. మాజీ కెప్టెన్ అర్జున్ రణతుంగ నేతృత్వంలో తాత్కాలిక కమిటీని నియమిస్తున్నట్లు ఓ ప్రకటనను మంత్రిత్వ శాఖ కార్యాలయం విడుదల చేసింది. 2023 వన్డే వరల్డ్ కప్‌లో నవంబర్ 2న భారత్ చేతిలో ఘోర పరాభవమే శ్రీలంక ఈ నిర్ణయానికి దారితీసిందని తెలుస్తోంది. ఈ విషయంలో ఇప్పటికే శ్రీలంక క్రికెట్ బోర్డు కార్యదర్శి మోహన్ డి సిల్వా రాజీనామా చేశారు.
అర్జున రణతుంగ నేతృత్వంలో నియమించిన ఏడుగురు సభ్యుల తాత్కాలిక కమిటీలో.. శ్రీలంక సుప్రీం కోర్డు విశ్రాంత న్యాయమూర్తి కూడా ఉన్నారు. పాత బోర్డు కార్యదర్శి డి సిల్వ రాజీనామా చేసిన మరుసటి రోజే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 2023 ప్రపంచ కప్‌లో భాగంగా సోమవారం బంగ్లాదేశ్‌తో శ్రీలంక తలపడనుంది. ఈ మ్యాచ్‌కు ముందు శ్రీలంక ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
'పదవిలో ఉండే నైతిక హక్కు వారికి లేదు'
దీనిపై శ్రీలంక క్రీడల మంత్రి రోషన్ రణసింఘే స్పందించారు. బోర్డులోని సభ్యులకు పదవిలో ఉండే నైతిక హక్కు లేదని.. తక్షణమే వారంతా స్వచ్ఛందంగా రాజీనామా చేస్తే బాగుండేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. బోర్డులో అవినీతి మితిమీరిందన్న మంత్రి.. ఆ కారణంగానే బోర్డును తొలగించాల్సిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు. అయితే 2023 వరల్డ్ కప్‌లో శ్రీలంక జట్టు ఘోర ఓటములతో బోర్డుపై విమర్శలు వచ్చాయి. దీంతో కార్యాలయంపై దాడి జరిగే అవకాశం ఉందని భావించిన కొలంబో పోలీసులు.. బోర్డు కార్యాలయ భవనం వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు.