Shami On India World Cup loss : టోర్నీ మొత్తంలో ఎదురులేకుండా దూసుకుపోయిన టీమ్ఇండియాకు ఫైనల్లో నిరాశ ఎదురైంది. ఆస్ట్రేలియా ఆరోసారి విశ్వవిజేతగా నిలిచింది. అయితే ఈ ఓటమిపై టీమ్ఇండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ స్పందించాడు. నిన్నటి రోజు మనది కాకుండా పోయిందని.. కానీ అంతకు రెట్టింపు ఉత్సాహంతో మళ్లీ టీమ్ఇండియా పుంజుకుంటుందని ధీమా వ్యక్తం చేశాడు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశాడు. అందులో ప్రధాని నరేంద్ర మోదీ తనను ఓదార్చుతున్న ఫొటో జతచేసి.. "దురదృష్టవశాత్తూ.. నిన్న మన రోజు కాదు. టోర్నమెంట్ మొత్తంలో మన జట్టుకు, నాకు మద్దతుగా నిలిచినందుకు భారతీయులందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా డ్రెస్సింగ్ రూమ్‌కి వచ్చి మా ఉత్సాహాన్ని పెంచినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు. మేము తిరిగి పుంజుకుంటాము" అని రాసుకొచ్చాడు.
ఫైనల్ మ్యాచ్ తర్వాత భారత జట్టు, టీమ్ఇండియా అభిమానులు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. మైదానంలో కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కళ్లలో నీళ్లు తిరిగాయి. బాధ తట్టుకోలేక బౌలర్ మహ్మద్ సిరాజ్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇలా ఫొటోలను, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. అభిమానులు కూడా తమ బాధను వ్యక్తం చేశారు. ఏది ఏమైనా తాము టీమ్ఇండియాతో ఉన్నామని మద్దతుగా నిలిచారు.