Pak Vs Eng World Cup 2023 Babar Azam :2023 వరల్డ్ కప్ రసవత్తరంగా మారింది. ఇప్పటికే టీమ్ఇండియా ఎదురులేకుండా దూసుకెళ్తుంటే.. దాయాది దేశం పాకిస్థాన్ ఆఖరి అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. శనివారం (నవంబర్ 11) పాక్ జట్టు ఇంగ్లాండ్‌తో తలపడుతోంది. ఇంగ్లాండ్ నాకౌట్ దశకు దూరమైంది. పాకిస్థాన్‌కు మాత్రం ఇంకా ఆశలు సజీవంగానే ఉన్నాయి. అయితే, పాక్ సెమీస్‌కు చేరాలంటే ఈ మ్యాచ్‌లో పాక్ భారీ తేడాతో గెలవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ పరిస్థితే పాక్ కెప్టెన్ బాబర్ అజామ్‌కు లైఫ్ అండ్ డెత్ సమస్యగా పరిణమించింది.
కెప్టెన్సీకి బాబర్ గుడ్‌బై!
2023 ప్రపంచ కప్‌లో అంచనాలు అందుకోలేకపోవడం, పేలవమైన ప్రదర్శన వల్ల బాబర్ అజామ్ విమర్శలు ఎదుర్కొంటున్నాడు. కెప్టెన్సీ నుంచి దిగిపోవాలనే డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్‌తో మ్యాచ్ తర్వాత బాబర్ తన కెప్టెన్సీకి గుడ్ బై చెప్పనున్నాడని వార్తలు వస్తున్నాయి. ఇంగ్లాండ్‌తో జరిగే మ్యాచ్ తర్వాత వైట్ బాల్ జట్టు కెప్టెన్సీకి దూరం కానున్నట్లు సమాచారం. పాక్‌కు తిరిగి వెళ్లిన తర్వాత పీసీబీ మాజీ ఛైర్మన్ రమీజ్ రజాతో కలిసిన తర్వాత.. బాబర్ తన నిర్ణయాన్ని వెల్లడిస్తాడని తెలుస్తోంది. వారి నుంచి వచ్చే సూచనల మేరకు కెప్టెన్‌గా ఉండాలా వద్దా అనే నిర్ణయం ఉండొచ్చని సమాచారం. అయితే ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లో ఏదైనా అద్భుతం జరిగితే తప్ప బాబర్ సారథిగా కొనసాగే అవకాశం ఉండదని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
ఈ వరల్డ్ కప్‌లో ఇప్పటివరకు జరిగిన పాక్ ప్లేయర్స్ అన్ని మ్యాచ్‌లో నిరాశపర్చారు. బ్యాటింగ్ విభాగం ఫర్వాలేదనిపించుకున్నా.. బౌలర్ల నుంచి మాత్రం సహకారం లభించలేదు. దీంతో టీమ్ భారీ స్కోర్లు నమోదు చేసినా.. విజయ తీరాలకు చేరలేదు. అయితే, జట్టు విఫలమవడం వల్ల.. ఆ మొత్తం భారం సారథి బాబర్ అజామ్‌పైనే పడుతోంది. ఈ మెగా టోర్నీలో పాకిస్థాన్ ఆడిన 8 మ్యాచ్‌ల్లో కేవలం 4 మాత్రమే గెలిచి 8 పాయింట్లు సాధించింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో న్యూజిలాండ్ తర్వాత ఐదో స్థానంలో కొనసాగుతోంది.