ODI World Cup 2023 Rachin Ravindra : ప్రస్తుతం ప్రపంచకప్‌లో భారతీయ మూలాలు కలిగిన న్యూజిలాండ్ ప్లేయర్ రచిన్ రవీంద్ర అద్భుతమైన ఆటతీరును ప్రదర్శిస్తున్నాడు. తాజాగా ఆస్ట్రేలియాతో తలపడిన మ్యాచ్‌లో రచిన్ శతకం సాధించాడు. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాలో చేతిలో ఓడినా.. రచిన్ ఆటతీరు మాత్రం ఆకట్టుకుంది. ఈ వరల్డ్‌కప్‌లో రెండు శతకాలు చేసి జోరుమీదున్నాడు. ఆస్ట్రేలియాతో మ్యాచ్ అనంతరం రచిన్ మీడియాతో మాట్లాడాడు. భారత్ మూలాలు కలిగి కివీస్ తరపున టోర్నీలో ఆడేటప్పుడు తీవ్ర ఒత్తిడికి గురి కావటం సహజమేనని చెప్పాడు. అయితే కీలక ఇన్నింగ్స్ ఆడటం మరితం గర్వంగా ఉందన్నాడు.
"టీమ్ఇండియాతో తలపడుతున్నప్పుడు ఒత్తిడి గురించి ఇప్పటికే చాలా సార్లు నన్ను అడిగారు. నేను సమాధానాలు కూడా ఇచ్చాను. మరోసారి చెబుతున్న నేను వందశాతం కీవీస్ ప్లేయర్‌నే. అయితే నేను భారతీయ మూలాలను కలిగి ఉండటం నాకు గర్వంగానూ ఉంది. నా తల్లిదండ్రులు పుట్టి పెరిగిన దేశం వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో ఇలాంటి ఆటతీరును ప్రదర్శించడం మరింత ఆనందంగా ఉంది. ఇక ఆట విషయానికొస్తే.. భారత్‌లో పిచ్‌లు బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటాయి. గతంలో నేను ఇక్కడ పర్యటించినప్పుడు గొప్ప ప్రదర్శన చేయలేకపోయాను. ఇప్పుడు మెరుగుపరుచుకున్నాను. ధర్శశాలలో అభిమానులు మద్దతు అద్భుతంగా ఉంది. ఇండియాలో ఎక్కడ ఆడినా.. మైదానంలో అభిమానుల సందడి, అరుపులతో ఉత్సాహపరుస్తున్న తీరు బాగుంటుంది. క్రికెట్ ఆడే వారికి చిన్నప్పటి నుంచి డ్రీమ్ ఒకటుంటుంది. స్టేడియంలో మన పేరును ఫ్యాన్స్ హోరెత్తిస్తుంటూ కలిగే అనుభూతిని అద్భుతంగా ఉంటుంది". అని రచిన్ వెల్లడించాడు.