ODI World Cup 2023 : వన్డే ప్రపంచ కప్‌లోలో హ్యాట్రిక్ విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో టీమ్ఇండియా అగ్రస్థానంలో నిలిచింది. ఆసీస్‌పై అద్భుత పోరాటంతో గెలిచిన టీమ్‌ఇండియా.. ఆ తర్వాత అఫ్గాన్, పాక్ జట్లను అలవోకగా చిత్తు చేసింది. దీంతో అందరి దృష్టి ఇప్పుడు టీమ్ఇండియాపై పడింది. అయితే తాజాగా టీమ్ఇండియా గురించి ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ వ్యాఖ్యానించాడు. భారత్‌ను ఓడించడమంటే ఇతర జట్లకు చాలా కష్టమని రికీ పేర్కొన్నాడు.
"వరల్డ్ కప్ ప్రారంభానికి ముందు నుంచే నేను చెబుతున్నాను. భారత్‌ను ఓడించడమంటే చాలా కష్టం అని. అద్భుతమైన ఆటగాళ్లతో ఆ జట్టు బరిలోకి దిగింది. అన్ని విభాగాలను పటిష్ఠంగా మలుచుకుంది. ఫాస్ట్, స్పిన్ బౌలింగ్ గురించి అయితే ఇక ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టాప్ ఆర్డర్, మిడిలార్డర్ కూడా బలంగా ఉంది. అందుకే, వారిని ఎదుర్కోవడం ఎలాంటి జట్టుకైనా కత్తిమీద సామే. అయితే, వరల్డ్ కప్ ముగింపు నాటికి ఉండే తీవ్ర ఒత్తిడిని తట్టుకుని ఇదే ఊపును భారత్ ఎలా కొనసాగిస్తుందో వేచి చూడాలి. ఆ ఒత్తిడిని అధిగమించడమే వారికి ఇప్పుడు కీలకంగా మారనుంది" అని పాంటింగ్ తెలిపాడు.
'అతని వల్లే విరాట్ అలా ఆడుతున్నాడు'
Rohit Sharma Ricky Ponting :ఇక ఇదే వేదికగా టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మను రికీ పాంటింగ్ కొనియాడాడు. అతని నాయకత్వంలో టీమ్ఇండియా కచ్చితంగా విజేతగా నిలిచే అవకాశాలున్నాయని రికీ అన్నాడు.