Inzamam Ul Haq Resignation : పాకిస్థాన్ పురుషుల క్రికెట్ టీమ్ సెలెక్షన్ కమిటీ ఛైర్మన్ (చీఫ్ సెలెక్టర్) ఇంజమామ్ ఉల్ హక్ తన పదవికి రాజీనామా చేశారు. మీడియాలో తనపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఇంజమామ్ రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు సోమవారం సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ ఎక్స్ వేదికగా వెల్లడించింది. భారత్‌లో జరుగుతున్న 2023 వన్డే ప్రపంచ కప్‌లో పాకిస్థాన్ వరుసగా విఫలం అవుతున్న నేపథ్యంలో తాజా పరిణామంతో ఆ టీమ్‌కు మరో ఎదురుదెబ్బ తగిలినట్లు అయింది.
"మీడియాలో పరస్పర విరుద్ధ ఆరోపణలు లేవనెత్తారు. ఆ ఆరోపణలపై పారదర్శకంగా విచారణ జరిపేందుకు పీసీబీకి అవకాశం కల్పించడానికి నేను నా పదవికి రాజీనామా చేస్తున్నాను. కమిటీ నన్ను నిర్దోషిగా తేల్చితే.. మళ్లీ చీఫ్ సెలెక్టర్‌గా నా పాత్రను తిరిగి కొనసాగిస్తాను"
--ఇంజమామ్ ఉల్ హక్, పీసీబీ మాజీ ఛైర్మన్
ఇదీ జరిగింది..
Inzamam Ul Haq Allegations : యజో ఇంటర్నేషనల్ లిమిటెడ్ ప్లేయర్స్ ఏజెన్సీలో ఇంజమామ్ వాటాదారుగా ఉన్నట్లు సమాచారం. పాకిస్థాన్ జట్టులోని ప్రధాన ఆటగాళ్లు బాబర్ అజామ్, మహ్మద్ రిజ్వాన్, షాహీన్ అఫ్రిది మరికొంతమంది ప్లేయర్స్‌కు ఈ సంస్థతో అనుబంధం ఉంది. దీంతో ఇంజమామ్ ఉల్ హక్‌కు అనుకూలంగా ఉండే ఆటగాళ్లనే ప్రపంచకప్‌కు ఎంపిక చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇంజమామ్‌పై వచ్చిన ఆరోపణలపై విచారణ చేపట్టడానికి పీసీబీ ఐదుగురు సభ్యులతో నిజనిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసింది. అంతకుముందు ఈ విషయంపై స్పందించిన ఇంజమామ్.. కొంతమంది వ్యక్తులు వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారని.. ఆ ఆరోపణలపై నిజనిజాలు తెలుసుకోవాలని అన్నారు. ఈ అంశంపై పీసీబీ విచారణ చేయాలని.. తనకు ప్లేయర్ ఏజెంట్ కంపెనీతో ఏ సంబంధమూ లేదు అని పేర్కొన్నారు. కాగా ఇంజమాన్ 2023 ఆగస్టు 7న పురుషుల జట్టుకు చీఫ్ సెలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఇక ఈ నెల ప్రారంభంలో జూనియర్ మెన్స్ జట్టు సెలెక్షన్ కమిటీకి ఛైర్మన్‌గా నియామకమయ్యారు.
Shami World Cup Wickets : సూపర్ ఫామ్‌లో షమీ.. అరుదైన రికార్డుకు అడుగు దూరంలో..
SL vs AFG World Cup 2023 : శ్రీలంకపై అఫ్గాన్ ఘన విజయం.. వరల్డ్ కప్‌లో ముచ్చటగా మూడో గెలుపు