India Vs Australia World Cup 2023 Final Winner Australia : వన్డే ప్రపంచ కప్పులో ఆస్ట్రేలియా తన అధిపత్యాన్ని చూపిస్తూ... ఆరోసారి విశ్వవిజేతగా నిలిచింది. వరుసగా పది విజయాలతో ఓటమి లేకుండా ఫైనల్‌కు చేరిన ఆతిథ్య భారత్‌కు కళ్లెం వేసి ఛాంపియన్‌గా అవతరించింది. అహ్మదాబాద్ వేదికగా నరేంద్రమోదీ స్టేడియంలో జరిగిన తుదిపోరులో 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. స్వదేశంలో జరిగిన టోర్నీలో మూడోసారి విశ్వవిజేతగా నిలవాలనుకున్న భారత్‌కు ఫైనల్లో భంగపాటు ఎదురైంది. టీమ్ఇండియా కప్పు గెలుస్తుందని ఎన్నో ఆశలతో చూసిన 140 కోట్ల భారతీయులకు మరోసారి నిరాశే మిగిలింది.
అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్... ఆస్ట్రేలియా బౌలర్ల ధాటికి నిర్ణీత 50 ఓవర్లలో 240 పరుగులకు ఆలౌటైంది. విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ అర్ధసెంచరీలతో రాణించారు. కెప్టెన్ రోహిత్ శర్మ 47 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. రోహిత్ శర్మ ఎప్పటిలాగే ధాటిగా ఆడి భారత్‌కు దక్కిన శుభారంభాన్నిచ్చాడు. మరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ త్వరగానే ఔటైనప్పటికీ.. మరో ఎండ్‌లోని కెప్టెన్ రోహిత్ శర్మ దూకుడుగా ఆడగా.. 9 ఓవర్లకే 70 పరుగులు దాటేసింది. భారత్ దూకుడుకు స్కోరు... 300 దాటడం ఖాయమనుకున్నారు.
కానీ ఆసీస్ బౌలర్లు నెమ్మదిగా భారత బ్యాటర్లపై ఒత్తిడి తెచ్చారు. స్వల్ప వ్యవధిలో రోహిత్, శ్రేయస్ పెవిలియన్ చేరగా... పరుగుల వేగం మందగించింది. ఈ నేపథ్యంలో విరాట్ - రాహుల్ జంట ఆచితూచి ఆడింది. ఇద్దరూ నాలుగో వికెట్‌కు 109 బంతుల్లో 67 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టారు. విరాట్ హాఫ్ సెంచరీ పూర్తి అయ్యాక కమిన్స్ బౌలింగ్‌లో ఔటవగా... భారత్ జట్టు కుదేలైంది. సూర్యకుమార్‌ను కాదని.. రవీంద్ర జడేజాను బ్యాటింగ్‌కు పంపినా ఫలించలేదు. మరోవైపు క్రీజ్‌లో పాతుకు పోయిన కేఎల్‌ను... స్టార్క్ బోల్తా కొట్టించాడు. చివరిలో.. మెరుపులు మెరిపిస్తాడనుకున్న సూర్యకుమార్ యాదవ్ కూడా తక్కువ పరుగులకే ఔటవగా.. భారత్ 240 పరుగులకే పరిమితమైంది. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ మూడు వికెట్లు తీయగా... ప్యాట్ కమిన్స్, జోష్ హేజిల్‌వుడ్ రెండేసి, గ్లెన్ మ్యాక్స్‌వెల్, ఆడమ్ జంపాలు ఒక్కో వికెట్ తీశారు.
అనంతరం 241 పరుగుల లక్ష్య ఛేదన దిగిన ఆసీస్‌కు ఆరంభంలో ఎదురుదెబ్బ తగిలింది. మమ్మద్ షమీ.. తాను వేసిన మొదటి ఓవర్‌లోనే డేవిడ్ వార్నర్‌ను పెవిలియన్ చేర్చాడు. తర్వాత జస్‌ప్రీత్ బూమ్రా.. మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్‌లను వెనక్కి పంపగా ఆసీస్ 47 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో ఓపెనర్ ట్రావిస్ హెడ్, మార్కస్ లబుషేన్... ఆసీస్ ఇన్నింగ్స్‌ను నిలకడగా ముందుకు నడిపించారు. ఈ క్రమంలో హెడ్ శతకం, లబుషేన్ అర్థశతకం పూర్తి చేసుకున్నారు. నాలుగో వికెట్‌కు 192 పరుగులు చేసిన తర్వాత 137 పరుగులు చేసిన హెడ్.. సిరాజ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. తర్వాత వచ్చిన గ్లెన్ మాక్స్‌వెల్ 2 పరుగులు చేయగా.. ఆసీస్ 241 పరుగుల లక్ష్యాన్ని అందుకుంది. లబుషేన్ 58 పరుగులతో అజేయంగా నిలిచాడు. భారత్ బౌలర్లలో బుమ్రా రెండు, షమి, సిరాజ్ ఒక్కో వికెట్ తీశారు.