India Vs Australia World Cup 2023 Final Preview : ప్రతిష్టాత్మక లార్డ్స్ స్టేడియంలో 1983లో కపిల్ దేవ్ కప్పును ఎత్తిన క్షణాలను.. 2011లో ధోని సిక్సు కొట్టి గెలిపించిన అనుభూతులను.. మరోసారి కళ్లారా వీక్షించాలని క్రికెట్ అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. స్వదేశంలో జరుగుతున్న.. ప్రపంచకప్ తుది పోరులో ఆస్ట్రేలియాను ఓడించి టీమిండియా విజయం సాధించాలని కోట్లమంది క్రికెట్ అభిమానులు.. ఆశిస్తున్నారు. కోట్ల మంది అభిమానుల ఆకాంక్షలను మోస్తున్న రోహిత్‌సేన.. తమ దృష్టంతా ఆటపైనే ఉంటుందని, ఒత్తిడి తమపై ఎప్పుడూ ఉండేదేనని ఇప్పటికే స్పష్టం చేసింది. అప్రతిహతంగా పది విజయాలతో ఫైనల్ చేరిన భారత్.. 11వ మ్యాచ్‌లోనూ గెలిచి ఓటమే లేకుండా ప్రపంచకప్ ఒడిసిపట్టాలనే పట్టుదలతో.. కసరత్తు చేస్తోంది. సారథి రోహిత్ సహా క్రికెటర్లంతా తమ కెరీర్‌లోనే అత్యంత కీలకమైన మ్యాచ్‌ను ఆడేందుకు సిద్ధమయ్యారు.
అన్ని విభాగాల్లో పటిష్ఠంగా భారత్..
ప్రపంచకప్ టోర్నీ ఆరంభం నుంచి.. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో సమష్టిగా రాణిస్తున్న భారత్ మరోసారి సత్తాచాటాలనే పట్టుదలతో ఉంది. భారత బ్యాటింగ్‌లో చాలా బలంగా కనిపిస్తోంది. రోహిత్ శర్మ ఈ టోర్నీలో ఇప్పటికే 550 పరుగులు చేసి దూకుడుపై ఉండగా.. 90 సగటుతో విరాట్ కోహ్లి 711 పరుగులు చేసి.. ఈ ప్రపంచకప్‌లోనే అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు. శ్రేయస్ అయ్యర్.... సెమీఫైనల్లో సెంచరీ చేసి మంచి ఫామ్‌లో ఉన్నాడు. రాహుల్ కూడా విధ్వంసకర బ్యాటింగ్‌తోఅలరిస్తున్నాడు. గిల్, జడేజాలు కూడా ఫామ్‌లో ఉన్నారు. కేఎల్ రాహుల్ ప్రశాంతత, రవీంద్ర జడేజా ఆల్ రౌండ్ నైపుణ్యం టీమ్ఇండియాకు.. అదనపు బలంగా మారాయి.
అశ్విన్ ఇన్ - సిరాజ్ ఔట్!
భారత్ బౌలింగ్‌లో అమ్రోహాఎక్స్‌ప్రెస్‌గా అభిమానులు ముద్దుగా పిలుచుకుంటున్న స్పీడ్ స్టార్ మహమ్మద్ షమీపై.. భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటి వరకు.. 23వికెట్లతో షమీ ప్రత్యర్థుల పతనాన్ని శాసించాడు. జస్‌ప్రీత్ బూమ్రా, మహ్మద్ సిరాజ్ కూడా అంచనాల మేరకు రాణిస్తే .. ఆస్ట్రేలియాపై గెలుపు భారత జట్టు నల్లేరుపై నడకేనని అభిమానులు ఆశిస్తున్నారు. నల్లమట్టి పిచ్‌పై.. ఈ మ్యాచ్ జరగనున్నందున... ఈ మ్యాచ్‌లో అశ్విన్‌ను మూడో స్పిన్నర్‌గా జట్టులోకి తీసుకోవాలని రోహిత్ సేన భావిస్తోంది. అదే జరిగితే.. సిరాజ్ బెంచ్‌కు పరిమితం కాకా తప్పని పరిస్థితి.