Ind Vs Pak World Cup 2023 : ఇండియా- పాకిస్థాన్ మ్యాచ్ అంటే క్రికెట్ లవర్స్‌కు ఎక్కడ లేని ఉత్సాహం వస్తుంది. నరాల తెగే ఉత్కంఠతో జరిగే ఈ పోరులో తమ జట్టు గెలవాలంటూ ఇండో - పాక్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అహ్మదబాద్ వేదికగా జరిగిన తాజా మ్యాచ్‌లోనూ ఇదే జరిగింది. లక్షల మంది వీక్షకుల నడుమ సాగిన ఆ హోరా హోరీ పోరులో తుది గెలుపు టీమ్ఇండియాకు దక్కింది. బుమ్రా, సిరాజ్ లాంటి బౌలర్ల దెబ్బకు పాక్ జట్టు విల విలలాడగా.. రోహిత్, శ్రేయస్ పరుగుల వరదకు ఇక భారత జట్టుకు విజయం ఖారరైంది. పాక్ బౌలర్లు ఎంతో శ్రమించినప్పటికీ మన ప్లేయర్లను చిత్తు చేయలేకపోయారు.
మ్యాచ్ ముందు నుంచే మైండ్‌గేమ్..
టాస్ నుంచే టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తూ.. ప్రత్యర్థుల్లో సందేహాలు రేకెత్తించాడు. బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్న పిచ్‌పై టాస్ గెలిచినప్పటికీ.. బౌలింగ్‌నే ఎంపిక చేసుకున్నాడు. ఒకవేళ కొండంత లక్ష్యం ఎదురుగా పెట్టినా కూడా.. తమ బ్యాటింగ్ లైనప్ దాన్ని పిండిచేస్తుందనే ధైర్యంతో ముందుకు సాగాడు. అంతేకాదు.. తమ బౌలర్లు పాక్‌ను తక్కువకే కట్టడి చేస్తారన్న విశ్వాసాన్ని కూడా కనబర్చాడు. ఇన్నింగ్స్ మొదలై పాక్ బ్యాటర్లు రెండు ఓవర్ల పాటు సిరాజ్‌పై ఎదురు దాడి చేసినా కూడా.. పవర్ ప్లేలో అతడి రికార్డును దృష్టిలోపెట్టుకొని అతడితోనే బౌలింగ్‌ను కొనసాగించాడు. ఇక సిరాజ్ కూడా కూడా కెప్టెన్ నమ్మకాన్ని వమ్ముచేయకుండా షఫీక్ రూపంలో తొలి వికెట్‌ను అందించాడు.
అయితే వైట్ బాల్ క్రికెట్‌లో ప్రత్యర్థి రన్‌రేట్‌ను కట్టడి చేయడం అనేది చాలా ముఖ్యం. వికెట్లు రావడం అనేది బోనస్ లాంటిది. భారత్ దీన్ని మైండ్‌లో పెట్టుకుంది. అలా ఓపెనర్ ఇమామ్ వికెట్ పడ్డాక.. బాబర్-రిజ్వాన్‌ల పని పట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ టోర్నిలో సూపర్‌ఫామ్‌లో ఉన్న రిజ్వాన్‌ను రోహిత్ తెలివిగా దెబ్బతీశాడు. పాండ్యా, జడేజా, కుల్దీప్‌లను మార్చిమార్చి బౌలింగ్ చేయించి భయపెట్టాడు. ఫలితంగా పవర్ ప్లే తర్వాత పాక్ జట్టు ఒక ఓవర్‌లో పది పరుగులు సాధించిన సందర్భాలు కేవలం మూడే ఉన్నాయి.
ఇక 20వ ఓవర్ వచ్చేసరికి పాక్ బ్యాటర్లపై బాగా ఒత్తిడి పెరిగింది. దీంతో రన్‌రేట్ అమాంతం పడిపోయింది. దీంతో 20-42వ ఓవర్ మధ్యలో పాక్ ప్లేయర్లు కేవలం 8 సార్లు మాత్రమే ఓవరకు ఐదు అంత కంటే ఎక్కువ పరుగులు చేశారు. జడేజా, కుల్దీప్ వేసిన 23-28 ఓవర్ల మధ్య ఏ ఓవర్‌లోనూ పాక్ 5 పరుగులు చేయలేదు. అయితే తొలి స్పెల్‌లో ధారాళంగా పరుగులిచ్చిన సిరాజ్‌ను టార్గెట్ చేశారు పాక్ బ్యాటర్లు. అయితే బాబర్ వికెట్‌ను తీసిన సిరాజ్ వారి అంచానలను తారుమారు చేశాడు. వికెట్లు రాకపోతే.. పరుగులు కట్టడి చేస్తే ఫలితం లభిస్తుందనే సూత్రాన్ని భారత్ అద్భుతంగా అమలు చేసింది. అలా బౌలర్లు కట్టుదిట్టంగా ఆడి జట్టును విజయ పథంలో నడిపించారు.