IND Vs NZ World Cup 2023 Semi Final Review : భారత్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్‌కప్.. తుదిదశకు చేరుకుంది. స్వదేశంలో జరుగుతున్న ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌తో నాకౌట్ మ్యాచ్‌కు టీమ్ఇండియా సిద్ధమైంది. ఈ మహా సంగ్రామంలో వరుస విజయాలతో ఊపు మీదున్న రోహిత్ సేన.. అదే ఊపుతో కివీస్‌ను ఓడించాలని భావిస్తోంది. బ్యాటింగ్ విభాగంలో బ్యాటర్లు అదరగొడుతుండగా.. బౌలర్లు పదునైన పేస్‌తో ప్రత్యర్థి బ్యాటర్లను బెదరగొడుతున్నారు. స్పిన్నర్లు బ్యాటర్లను కట్టడి చేస్తుండగా.. ఫీల్డర్లు మైదానంలో చురుగ్గా కదులుతున్నారు. ఇలా ఏ విభాగంలో చూసినా టీమ్ఇండియా చాలా పటిష్ఠంగా కనిపిస్తోంది. భారీ అంచనాల మధ్య బరిలోకి దిగనున్న రోహిత్ సేన 2019 ప్రపంచకప్‌లో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకోవాలని పట్టుదలగా ఉంది.
ఈ ప్రపంచకప్‌ను భారత్ సాధిస్తుందన్న అంచనాలు భారీగా ఉండడం వల్ల.. ఆ ఒత్తిడిని టీమ్ఇండియా అధిగమించాల్సి ఉంది. జట్టు సభ్యులను ఈ ఒత్తిడి నుంచి దూరంగా ఉంచడంపై.. కెప్టెన్ రోహిత్, కోచ్ రాహుల్ ద్రవిడ్ దృష్టి సారించారు. వాంఖడే పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలిస్తుందన్న.. అంచనాలు ఉన్నాయి. భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుని భారీ స్కోరు చేస్తే సగం విజయం సాధించినట్లేనని.. మాజీలు అంచనా వేస్తున్నారు. వాంఖడేలో ఫ్లడ్ లైట్ల వెలుగుల్లో లక్ష్యాన్ని ఛేదించాల్సి రావడం.. కష్టంగా మారనుంది. కొత్త బంతితో తీవ్ర నష్టాన్ని కలిగించే బౌలర్లు.. ఇరు జట్లలోనూ ఉన్నారు.
రోహిత్ శర్మ మరోసారి రాణిస్తే టీమ్ఇండియాకు ఇక ఎదురుండదు. ఇప్పటికే ఈ ప్రపంచ కప్‌లో రోహిత్ 503 పరుగులు.. గిల్ 270 పరుగులు చేశారు. మీరు మరోసారి విధ్వంసకర ఓపెనింగ్ ఇస్తే భారత్ గెలుపు ఖాయమవుతుంది. విరాట్ కోహ్లీ కూడా ఈ టోర్నీలో 593 పరుగులు చేసి సచిన్ రికార్డును అధిగమించేందుకు సిద్ధంగా ఉన్నాడు. కె.ఎల్. రాహుల్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజాలతో బ్యాటింగ్ దుర్భేద్యంగా ఉంది. టీమ్ఇండియా బౌలింగ్ విభాగం కూడా.. పటిష్ఠంగా ఉంది. బుమ్రా, సిరాజ్, షమీ అదరగొడుతున్నారు. కుల్‌దీప్ యాదవ్, రవీంద్ర జడేజా కూడా సత్తా చాటుతున్నారు.