IND Vs AUS World Cup 2023 Final Umpires : 2023 వరల్డ్ కప్ ఆఖరి ఘట్టానికి చేరుకుంది. నవంబర్ 19 (ఆదివారం)న టీమ్ఇండియా.. ఆస్ట్రేలియాతో ఫైనల్ పోరులో తలపడనుంది. ఈ నేపథ్యంలో ఫైనల్ మ్యాచ్‌కు అంపైర్లు ఖరారయ్యారు. రిచర్డ్ కెటిల్‌బరో, రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్‌ను అంపైర్లుగా ప్రకటించింది ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్- ఐసీసీ. థర్డ్ అంపైర్‌గా ట్రినిడాగ్ & టొబాగోకు చెందిన జోయెల్ విల్సన్ వ్యవహరిస్తున్నాడు. ఫోర్త్ అంపైర్, మ్యాచ్ రిఫరీగా.. క్రిస్ గఫానీ, ఆండీ పైక్రాఫ్ట్ ఉన్నారు. అయితే ఇందులో ఒక అంపైర్.. కెటిల్‌బరో పేరు వింటేనే భారత క్రికెట్ అభిమానులు బెంబేలెత్తిపోతున్నారు. ఈసారి ఏం జరుగుతుందో అని ఆందోళనకు గురవుతున్నారు.
2014 టీ20 ప్రపంచ కప్ ఫైనల్, 2015 వన్డే ప్రపంచ కప్ సెమీఫైనల్, 2016 టీ20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్, 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్, 2019 వరల్డ్ కప్ సెమీ ఫైనల్స్‌లో సహా టీమ్ఇండియా ఆడిన పలు కీలక మ్యాచ్‌లకు కెటిబ్బరో అంపైర్‌గా వ్యవహరించాడు. అయితే ఈ కీలక మ్యాచ్‌ల్లో టీమ్ఇండియా ఓటమి పాలైంది. ఇక ఈసారి ఎలాగైనా వరల్డ్ కప్ ట్రోఫీ సాధించాలని ఉవ్విళ్లూరుతోంది భారత జట్టు. ఈ క్రమంలో కెటిల్‌బరో.. అంపైరింగ్ చేస్తుండటం వల్ల.. ఏమవుతుందో అని అభిమానులు భయపడుతున్నారు. పాత మ్యాచ్‌ల ఫొటోలను షేర్ చేసుకుంటూ కెటిబ్బరోను ట్రోల్ చేస్తున్నారు.
ఇద్దరూ ఒకేరోజు..
రిచర్డ్ కెటిల్‌బరో, రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్ 2009 నవంబర్‌లో ఒకే రోజు ఐసీసీ జాబితాలోకి ప్రమోట్ అయ్యారు. ఇక భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన సెమీ ఫైనల్లోనూ అంపైర్లుగా వ్యవహరించారు. ఈ అంపైర్లు ఇద్దరూ డేవిడ్ షెఫర్డ్ ట్రోఫీలను గెలుచుకున్నారు. దీంతో పాటు ఐసీసీ నుంచి 'అంపైర్ ది ఇయర్' అవార్డులను కూడా సొంతం చేసుకున్నారు. కెటిబ్బర్గ్.. 2013 నుంచి 2015 మధ్య మూడు సార్లు ఈ అవార్డు గెలుచుకోగా.. ఇల్లింగ్‌వర్త్ 2019 నుంచి 2022 మధ్య 'అంపైర్ ఆఫ్ ది ఇయర్' అవార్డు సాధించారు.