David Willey Retirement 2023 :ఇంగ్లాండ్ బౌలర్ డేవిడ్ విల్లీ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. భారత్ వేదికగా జరుగుతున్న 2023 వన్డే వరల్డ్ కప్ తర్వాత అన్ని అంతర్జాతీయ క్రికెట్ ఫార్మాట్ల నుంటి రిటైర్ అవనున్నట్లు ప్రకటించాడు. ఈ మేరకు సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేశాడు. అందులో 'ఇలాంటి రోజు రావాలని నేను ఎప్పుడూ కోరుకోలేదు. నేను చిన్ననాటి నుంచి కేవలం ఇంగ్లాండ్ జట్టుకు క్రికెట్ ఆడాలని ఎన్నో కలలు కన్నాను. కాబట్టి, జాగ్రత్తగా ఆలోచించి, పరిశీలనతో ప్రపంచకప్ ముగిశాక అన్ని రకాల అంతర్జాతీయ క్రికెట్ ఫార్మాట్ల నుంచి రిటైర్ కావాల్సిన సమయం ఆసన్నమైందని భావిస్తున్నాను. ఎంతో గర్వంతో నా ఒంటిపై ఈ జెర్సీ ధరించాను. నా ఛాతీపై ఉన్న బ్యాడ్జ్‌కు ఎంతో కోసం పాటుపడ్డాను. ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాళ్లతో కూడిన అద్భుతమైన వైట్ బాల్ జట్టులో భాగమైనందుకు నేను చాలా అదృష్టవంతుడిని. నా కెరీర్లో నేను కొన్ని ప్రత్యేకమైన జ్ఞాపకాలను, గొప్ప స్నేహితులను సంపాదించాను. అలాగే కొన్నిసార్లు కష్టాలు అనుభవించాను. నా భార్యా పిల్లలు, అమ్మ, నాన్నల త్యాగం.. వారి మద్దతు లేకుంటే నా కలలు సాకారమయ్యేవి కావు. నేను మైదానం లోపల, బయట ఇంకా చేయాల్సింది చాలా ఉంది. అయితే ప్రస్తుత వరల్డ్ కప్‌లో మా జట్టు ప్రదర్శనకు, నా రిటైర్మెంట్ ప్రకటనకు ఎలాంటి సంబంధం లేదు.' అంటూ సుదీర్ఘ పోస్టు పెట్టాడు విల్లీ.
David Willey Stats :ఇప్పటివరకు విల్లీ ఇంగ్లాండ్ తరఫున 70 వన్డేలు, 43 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. వన్డేల్లో 30.34 బౌలింగ్ సగటుతో 94 వికెట్లు పడగొట్టాడు. టీ20ల్లో 23.13 యావరేజ్‌తో 51 వికెట్లు తీశాడు. ఇక బౌలింగ్‌కే పరిమితం కాకుండా బ్యాట్‌తో కూడా జట్టుకు సేవలందించాడు డేవిడ్ విల్లీ. అతడికి ఓడీఐల్లో బ్యాటింగ్ సగటు 26.12, స్ట్రైక్ రేట్ 93.1గా ఉంది. ఇక టీ20ల్లో బ్యాటింగ్ యావరేజ్ 15.06 ఉండగా.. స్ట్రైక్ రేట్ 130.63గా ఉంది.