Babar Azam Chat Leak :2023 వరల్డ్ కప్‌లో తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్న పాకిస్థాన్‌ను సమస్యలు చుట్టుముడుతున్నాయి. సోమవారం ఆ జట్టు చీఫ్ సెలెక్టర్ ఇంజమామ్ ఉల్ హక్ అవినీతి ఆరోపణలతో తన పదవికి రాజీనామా చేశారు. మరోవైపు పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ కూడా తన ఆటతీరుతోనే కాకుండా.. బయట కూడా వివాదాల్లో చిక్కుకుంటున్నాడు. ఈ వరల్డ్ కప్ మెగాటోర్నీలో టీమ్ ప్రదర్శనతో విమర్శలు ఎదుర్కొంటున్న బాబర్ అజామ్ కాల్ చేస్తే.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు- పీసీబీ ఛైర్మన్ స్పందించకపోవడం.. ఆపై అతడి చాట్స్ లీకేజీ వంటి ఘటనలతో వివాదాల్లో నిలిచాడు. ఈ వివాదాల్లో చిక్కుకున్న బాబర్‌కు అండగా పాక్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది నిలిచాడు.
Babar Chat Leaked Screenshot :ఇటీవల పాకిస్థాన్ క్రికెట్లో జరుగుతున్న పరిణామాలపై ఓ టీవీ ఇంటర్వ్యూ సందర్భంగా షాహిద్ అఫ్రిది స్పందించాడు. 'నేను ఒకటే చెబుతాను.. ఇది చాలా చాలా చెత్తపని. ఎవరివైనా వ్యక్తిగత మెసేజ్‌లను టీవీలో ఎలా ప్రసారం చేస్తారు. అది కూడా మన జట్టు సారథి మెసేజ్‌లా..? మన ప్లేయర్లనే మనం ఇంతలా అవమానిస్తున్నాం. ఈ పని పీసీబీ ఛైర్మన్ చేసినా అది తప్పే. అతడికి అజామ్‌తో అభిప్రాయభేదాలున్నాయని రషీద్ లతీఫ్ చెబుతున్నాడు. అందుకే బాబర్ కాల్ చేసినా అతడు సమాధానం చెప్పలేదంటున్నారు. ఈ లీకేజీ వ్యవహారాన్ని షోయబ్ బయటకు తెచ్చినట్లు నేను భావిస్తున్నాను. అతడు ఇలా ఎందుకు చేశాడు. ఛైర్మన్ అతడిని ఇలా చేయమని చెప్పారా..? ఒక వేళ ఛైర్మన్ చెప్పినా ఇది చాలా చెత్తపని' అని అఫ్రిది ఘాటు వ్యాఖ్యలు చేశాడు.