ICC World Cup 2023 : అక్టోబర్ 5 నుంచి భారత్ వేదికగా జరగబోయే ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతుందా అని క్రికెట్ అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. నాలుగేళ్లకోసారి జరిగే ఈ సమరానికి అంతలా క్రేజ్ ఉంటుంది మరి. అయితే మరో వంద రోజుల్లో ప్రారంభమయ్యే ఈ మెగా టోర్నీలో కాళ్లు దువ్వేందుకు అన్ని జట్లు సిద్ధమవుతున్న వేళ ఐసీసీదీనికి సంబంధించి షెడ్యూల్‌ను కూడా విడుదల చేసింది. ఈ నేపథ్యంలో టీమ్ఇండియా మాజీ ఆల్‌రౌండర్ వీరేంద్ర సెహ్వాగా వన్డే వరల్డ్‌కప్ 2023పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అప్పుడు మేము టైటిల్‌ను గెలిచి.. దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందూల్కర్‌కు అంకితం చేస్తే.. ఈసారి ట్రోఫీని గెలిచి విరాట్‌కు డెడికేట్ చేయాలని కోరాడు. ప్రముఖ స్టార్‌స్పోర్ట్స్‌కు ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో సెహ్వాగ్ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఇక కోహ్లి తన బ్యాటింగ్‌లో వందశాతం ఇచ్చేందుకు శాయాశక్తులా ప్రయత్నిస్తాడని చెప్పాడు.
"2011లో వన్డే ప్రపంచ కప్‌ను గెలిచి మేము సచిన్‌కు అంకితమిచ్చాం. ఇప్పుడు 2023 వన్డే వరల్డ్‌కప్ విరాట్ కోహ్లీ కోసం గెలవాలి. సచిన్ తర్వాత భారత క్రికెట్లో అద్భుతమైన రికార్డులు సాధించిన ఆటగాడు కోహ్లీ. బహుశా అతడికి ఇదే చివరి ప్రపంచకప్ కావచ్చు. ఇందుకోసమైనా టీమ్ఇండియా ఈసారి కప్పు గెలవాలి. గెలుస్తుంది. 34 ఏళ్ల కింగ్ విరాట్ కోహ్లీ కూడా ఈ వరల్డ్‌కప్‌ను గొప్ప అవకాశంగా మలుచుకోవాలని ఎదురుచూస్తున్నాడు. లక్షలాది మంది అభిమానుల మధ్య అహ్మదాబాద్ వేదికగా జరిగే ఫైనల్ మ్యాచ్‌లో టీమ్ఇండియాను చూడాలని ఉంది. ఈసారి సొంతగడ్డపై టోర్నీ జరగడం భారత్‌కు కలిసొచ్చే అంశం. అలాగే టీమ్ఇండియా ఆడబోయే మ్యాచ్‌ల మైదానాల పిచ్‌లపై కోహ్లీకి పూర్తి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో రానున్న వరల్డ్‌కప్ పోరులో కోహ్లీ తన ప్రతిభతో కప్పును కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది "