icc cricket world cup pakistan : భారత్ అతిథ్యం ఇవ్వనున్న వన్డే వరల్డ్ 2023లో పాకిస్థాన్ పాల్గొనే అంశంపై ప్రతిష్టంభన నెలకొంది. తాజాగా ఈ విషయంపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మేనేజ్‌మెంట్ కమిటీ చైర్మన్ నజామ్ సేథీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్కు తమ జట్టును పంపించాలో లేదో అనే విషయం ప్రభుత్వ పరిధిలో ఉందని స్పష్టం చేశారు. పాకిస్థాన్ ఆడే వేదికలను కూడా పాక్ ప్రభుత్వం ఆమోదించాలన్నారు. నజామ్ సేథీ చేసిన ఈ వ్యాఖ్యలు వన్డే వరల్డ్ కప్2023 షెడ్యూల్ను ఖరారు చేసే ముందు ఐసీసీని ఇరుకున పెట్టాయి. ఆసియా కప్ 2023 నిర్వహణపై భారత్, పాక్తో సహా ఆసియా క్రికెట్ మండిలి (ఏసీసీ) సభ్య దేశాలు ఏకాభిప్రాయానికి వచ్చిన నేపథ్యంలో నజామ్ సేథీ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
"భారత్, పాకిస్థాన్ ఎక్కడి వెళ్లాలి అనే నిర్ణయాలు పీసీబీ గాని.. బీసీసీఐ గాని తీసుకోలేవు. ఈ రెండు దేశాల ప్రభుత్వాలు మాత్రమే అలాంటి నిర్ణయాలు తీసుకోగలవు. భారత్.. పాకిస్థాన్లో పర్యటించాలా? వద్దా? అనే దానిపై ఆ దేశ ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంటుంది. అలాగే పాకిస్థాన్ ప్రభుత్వం కూడా వ్యవహరిస్తుంది. అహ్మదాబాద్‌లో ఆడతారా అని మమ్మల్ని అడగాల్సిన అవసరం లేదు. మేము భారత్కు వెళ్తామా లేదా అన్నది సమయం వచ్చినప్పుడు అదే తెలుస్తుంది. ఆ తర్వాత ఏ వేదికపై ఆడతామన్నది స్పష్టత వస్తుంది. ఈ రెండు అంశాలపై మా నిర్ణయం ఆధారపడి ఉంటుంది" అని విలేకరుల సమావేశంలో నజామ్ సేథీ అన్నారు.