పాకిస్థాన్ మాట మార్చింది. భారత్‌లో వన్డే వరల్డ్ కప్ ఆడడానికి.. ఆ దేశ క్రికెట్ బోర్డు వేదికలను ఎంపిక చేసుకుంటోంది. ఇండియాలోని 12 నగరాల్లో జరగబోయే ఈ మెగా టోర్నీలో.. భద్రతా కారణాల దృష్ట్యా తాము చెన్నై, కోల్‌కతా వేదికల్లోనే అన్ని మ్యాచ్‌లు ఆడతామని పాకిస్థాన్ చెబుతోంది. ఈ మేరకు పాక్.. ఐసీసీ ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరుపుతోందని ఐసీసీ వర్గాల సమాచారం. అయితే, వరల్డ్ కప్‌నకు సంబంధించిన అన్నీ మ్యాచ్‌లు ఎక్కడ నిర్వహించాలనేది బీసీసీఐ, భారత ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. ఈ క్రమంలో.. ఒక వేళ ఇండియా ఛాన్స్ ఇస్తే.. కోల్‌కతా, చెన్నై లాంటి ప్రదేశాల్లో ఆడడానికి పాకిస్థాన్ ఇష్టపడుతున్నట్లు తెలుస్తోంది.
2016లో కోల్‌కతాలో పాకిస్థాన్ టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ ఆడింది. అక్కడ సెక్యూరిటీ పాక్‌కు నచ్చింది. అలాగే చెన్నైలో కూడా పాకిస్థాన్‌కు కొన్ని మంచి అనుభవాలు ఉన్నాయి. దీంతో చెన్నై వేదిక కూడా తమకు సురక్షితమని భావిస్తోంది పాక్ జట్టు. ఈ మెగా టోర్నీలో ముఖ్యమైన ఘట్టం.. ఇండియా-పాకిస్థాన్ మధ్య జరిగే మ్యాచ్‌లే. అహ్మదాబాద్‌లో ఉన్న నరేంద్ర మోదీ స్టేడియం సామర్థ్యం లక్షా 32 వేలు. ఈ వేదికలో భారత్-పాక్ మ్యాచ్ జరిగితే చాలా డబ్బులు వస్తాయి. కానీ ఈ వేదికలో ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. అయితే, ఐసీసీ.. ఈ వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదల చేస్తేనే ఈ విషయంపై స్పష్టత వస్తుంది.