ICC World Cup 2023 India Squad :ఆసియా కప్ 2023 సూపర్ 4 స్టేజ్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమ్ఇండియా బౌలర్ అక్షర్ పటేల్ గాయపడ్డాడు. దీంతో బీసీసీఐ భారత వరల్డ్ కప్ స్క్వాడ్‌ను మార్చాల్సి వచ్చింది. అందులో భాగంగా సీనియర్ ప్లేయర్ రవిచంద్రన్ అశ్విన్‌ను జట్టులోకి తీసుకున్నారు. అయితే, అక్షర్ పటేల్ స్థానంలో అశ్విన్ జట్టులోకి వచ్చే క్రమంలో జరిగిన పరిణామాలను బీసీసీఐ అధికారి ప్రత్యేకంగా 'ఈటీవీ భారత్'కు తెలిపారు.
సెప్టెంబర్ 5న బీసీసీఐ వరల్డ్ కప్ 2023 జట్టును ప్రకటించింది. ఇందులో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాతో పాటు అక్షర్ పటేల్‌ను రెండో స్పిన్నర్‌గా తీసుకున్నారు. అక్షర్ పటేల్ గాయం కారణంగా పరిస్థితులు మారాయి. అతడు కోలుకోవడానికి 4-5 వారాల సమయం పడుతుంది. ఈ నేపథ్యంలో తమకు వేరే మార్గం కనబడలేదని.. అందుకే సీనియర్ ప్లేయర్, మంచి అనుభవం కలిగిన రవిచంద్రన్ అశ్విన్‌ను జట్టులోకి తీసుకున్నామని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ బీసీసీఐ అధికారి 'ఈటీవీ భారత్'కు చెప్పారు.
"అక్షర్‌కు గాయం అయిన తర్వాత అశ్విన్‌ను జట్టులోకి తీసుకోవడం కోసం టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అతడిని సంప్రదించాడు. అయితే, ఫిట్నెస్ సాధించేందుకు తనకు కొంత సమయం కావాలని అశ్విన్.. రోహిత్‌ను అడిగాడు. ఆ తర్వాత జట్టు కూర్పుపై తీవ్ర కసరత్తు చేసి, లెక్కలు వేసుకుని.. నలుగురు పేసర్లతో పాటు ఒక ఆఫ్ స్పిన్నర్, లెఫ్ట్ హ్యాండ్ స్నిన్నర్తో స్క్వాడ్ ఎంపిక పూర్తి చేశాం" అని ఆ బీసీసీఐఅధికారి వివరించారు.