ICC World Cup 2023 IND VS PAK : కొన్ని రోజుల క్రితం వన్డే ప్రపంచ కప్ కోసం డ్రాఫ్ట్ షెడ్యూల్‌ను అన్ని సభ్య దేశాలకు పంపింది బీసీసీఐ. ఇప్పుడు తాజాగా తుది షెడ్యూల్‌ను ఐసీసీ అధికారికంగా ప్రకటించింది. అయితే డ్రాఫ్ట్ షెడ్యూల్‌లోని పలు వేదికలపై పాకిస్థాన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. అఫ్గానిస్థాన్‌తో జరగబోయే మ్యాచ్ వేదిక చెన్నై, ఆస్ట్రేలియాతో జరగబోయే బెంగళూరు వేదికలను మార్చాలని ఐసీసీని కోరింది. భద్రతా కారణాల దృష్ట్యా ముంబయిలోనూ తమ జట్టు మ్యాచ్‌లను నిర్వహించొద్దని పాక్ విజ్ఞప్తి చేసింది. అయితే పాకిస్థాన్ అభ్యర్థనను బీసీసీఐ, ఐసీసీ పట్టించుకోలేదు. ఆ వేదికల్లోనే మ్యాచ్‌లను నిర్వహించేలా షెడ్యూల్‌ను ఖరారు చేసి తాజాగా ప్రకటించారు.
ఈ నేపథ్యంలో తాజా వన్డే ప్రపంచకప్ షెడ్యూల్‌పై పాకిస్థాన్ ఎలా స్పందిస్తుందనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. షెడ్యూల్‌ను క్లియరెన్స్ లెటర్ కోసం ప్రభుత్వానికి పంపనున్నట్లు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అధికార వర్గాలు తెలిపాయి. ఈ వరల్డ్ కప్ కోసం భారత్‌కు వెళ్లడానికి.. పాకిస్థాన్ ప్రభుత్వం ఇప్పటికైతే నిరభ్యంతర పత్రం(NOC) జారీ చేయలేదని పీసీబీ అధికారులు వెల్లడించారు. "వరల్డ్‌కప్‌లో పాల్గొనడం, అక్టోబర్ 15న అహ్మదాబాద్‌లో(టీమ్ఇండియాతో మ్యాచ్), ఒకవేళ సెమీ ఫైనల్‌కు అర్హత సాధిస్తే ముంబయిలో ఆడటం అనేది.. ప్రభుత్వం నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. గవర్నమెంట్ నుంచి వచ్చే క్లియరెన్స్ ఆధారంగానే మేం టోర్నీలో పాల్గొంటాం. దీని గురించి ఐసీసీకి ముందుగానే సమాచారం ఇచ్చాం" అని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు వర్గాలు తెలిపాయి.
ICC World Cup 2023 schedule : షెడ్యూల్ ఇదే.. అక్టోబర్ 5న అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లాండ్- న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగే పోరుతో ఈ మహా సమరం ప్రారంభంకానుంది. లీగ్ దశలో భారత జట్టు 9 మ్యాచ్‌ల్లో పోటీ పడనుంది. అక్టోబర్ 8న భారత్ తన తొలి మ్యాచ్‌ను ఆస్ట్రేలియాతో ఆడనుంది. అక్టోబర్ 15న అహ్మదాబాద్ వేదికగా చిరకాల ప్రత్యర్థులైన ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ జరగనుంది. ముంబయి, కోల్‌కతా వేదికగా నవంబర్ 15, 16న సెమీ ఫైనల్ మ్యాచ్‌లు జరగగా... నవంబర్ 19న అహ్మదాబాద్ వేదికగా ఫైనల్ మ్యాచ్ నిర్వహించనున్నారు. రెండు సెమీ ఫైనల్స్‌తో పాటు తుది పోరుకు రిజర్వ్ డే (నవంబర్ 20) ఉన్నట్లు తెలిపారు.