ICC World cup hyderabad : బీసీసీఐపై హైదరాబాద్ క్రికెట్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్‌మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఎందుకంటే.. నేడు(జూన్ 27న) వన్డే వరల్డ్‌కప్ 2023కి సంబంధించి పూర్తి షెడ్యూల్‌ను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) విడుదల చేసింది. ఈ ప్రపంచ కప్‌నకు సంబంధించిన మ్యాచులు పది వేదికల్లో జరగనున్నాయి. ఇందులో హైదరాబాద్‌కు కూడా ఉంది. అయితే టీమ్ఇండియాకు సంబంధించి హైదరాబాద్ వేదికలో ఒక్క మ్యాచ్ కూడా లేదు. దీంతో అభిమానులు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. తీవ్ర అసంతృప్తితో బీసీసీఐపై ఫైర్ అవుతున్నారు.
టీమ్ఇండియా ఒక్కటి కూడా..
వరల్డ్‌కప్‌లో భాగంగా హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో.. కేవలం పాకిస్థాన్, న్యూజిలాండ్ మ్యాచ్‌లనే నిర్వహించనున్నారు. ఈ రెండు టీమ్‌లు కూడా క్వాలిఫయర్స్‌లో గెలిచే చిన్న జట్లతోనే ఆడనున్నాయి. ఇదే తెలుగు ఫ్యాన్స్‌కు కోపం తెప్పించింది. ఉప్పల్ స్టేడియంపై బీసీసీఐ వివక్ష చూపుతోందని క్రికెట్ ప్రియులు విమర్శలు గుప్పిస్తున్నారు. 'ఏదో ఫార్మాలిటీగా ముష్టి పడేసినట్లు మూడు మ్యాచ్‌లు మా మొహాన పడేశారు', 'ఇంతదానికి హైదరాబాద్‌లో మ్యాచ్‌లు నిర్వహించడం ఎందుకు', 'హైదరాబాద్‌పై బీసీసీఐకి ఎందుకు ఇంత వివక్ష చూపిస్తుంది' అంటూ తెగ అంసతృప్తి వ్యక్తం చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు.
హైదరాబాద్ అభిమానులకు అర్థం చేసుకోరా?
2011 వరల్డ్ కప్ సమయంలోనూ హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో టీమ్ఇండియా మ్యాచులు జరగలేదు. అసలు అప్పుడు హైదరాబాద్‌ను వేదికగా కూడా ఎంపిక చేయలేదు. 2016 టీ20 వరల్డ్ కప్‌లోనూ ఇదే జరిగింది. ఈసారైనా హైదరాబాద్‌లో టీమ్ఇండియా ప్రపంచకప్ మ్యాచ్ చూడాలని అనుకున్న అభిమానుల ఆశ తీరలేదు. నిజానికి అత్యంత లాయల్ క్రికెట్ ఫ్యాన్స్‌కు హైదరాబాద్ వేదిక. 2022 సెప్టెంబర్‌లో ఆస్ట్రేలియాతో టీ20 మ్యాచ్, 2023 జనవరి 18 న్యూజిలాండ్‌తో మ్యాచ్ జరిగినప్పడు భారీ సంఖ్యలో అభిమానులు టికెట్ల కోసం తరలి వచ్చారు. ఒకానొక దశలో టికెట్ల కోసం తొక్కిసలాట కూడా జరిగింది. హైదరాబాద్‌లో క్రికెట్ చూడటానికి ఎంతో మంది ఆసక్తి చూపిస్తారనడానికి ఇదే నిదర్శనం.
2023 ఐపీఎల్ సమయంలో కూడా క్రికెట్ అభిమానులతో ఉప్పల్ స్టేడియం కళకళలాడింది. ఈ వేదికగా సన్‌రైజర్స్ ఆడిన ప్రతి మ్యాచ్‌కు పెద్ద సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. ప్రతిసారీ స్టేడియం నిండిపోయేది. అలాంటప్పుడు ఎందుకు టీమ్ఇండియా మ్యాచులు నిర్వహించలేదని హైదరాబాద్ క్రికెట్ అభిమానులు అడుగుతున్నారు. దేశంలోనే అతిపెద్ద స్టేడియాల్లో ఇదొకటని, 50 వేల వరకు ప్రేక్షకులు సామర్థ్యం ఉందని, ఇక్కడ వర్షం పడే అవకాశాలు కూడా తక్కువగా ఉంటాయని, రాత్రి సమయాల్లో తేమ కూడా తక్కువగా ఉంటుందని, టాస్ మీద ఆధారపడాల్సిన అవసరం ఉండదని ఫలితంగా మ్యాచ్ హోరాహోరీగా జరిగే అవకాశాలు ఉంటాయని అంటూ స్టేడియం ప్రాముఖ్యతను ఫ్యాన్స్ తెలియజేస్తున్నారు. పుణె, లఖ్‌నవూ లాంటి స్టేడియాలలో టీమ్ఇండియా మ్యాచ్‌లు పెట్టి.. హైదరాబాద్‌ను విస్మరించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.