Renuka Singh Thakur: కొంతకాలంగా టీ-20ల్లో సంచలన ప్రదర్శన చేస్తోంది భారత మహిళా క్రికెటర్ రేణుకా సింగ్ ఠాకుర్. ఇటీవల కామన్వెల్త్ గేమ్స్‌లో లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచింది. మొత్తం 11 వికెట్లతో భారత విజయాల్లో కీలక పాత్ర పోషించింది. ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్లోనూ 2 కీలక వికెట్లు పడగొట్టింది రేణుకా. ఇప్పుడు ఐసీసీ తాజాగా ప్రకటించిన టీ-20 బౌలర్ల ర్యాంకింగ్స్‌లో దూసుకెళ్లింది. తన కెరీర్ బెస్ట్ 18వ స్థానంలో నిలిచింది. ఏకంగా 10 స్థానాలు ముందుకొచ్చి.. టాప్-20లోకి ప్రవేశించింది. ఇంగ్లాండ్ లెఫ్టార్మ్ స్పిన్నర్ సోఫీ ఎసిల్స్టోన్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఫాస్ట్ బౌలర్ కేథరిన్ బ్రంట్ రెండో స్థానంలో ఉంది.
బ్యాటర్లలో ఆస్ట్రేలియా ఓపెనర్ బెత్ మూనీ మళ్లీ నెం.1 ర్యాంకుకు చేరింది. కెప్టెన్ మెగ్ లానింగ్ రెండో స్థానంలో ఉంది. భారత బ్యాటర్ జెమిమా రోడ్రిగ్స్ తిరిగి టాప్-10లోకి ప్రవేశించింది. ఏకంగా ఏడు స్థానాలు మెరుగైంది.
కామన్వెల్త్ క్రీడల్లో తొలి మ్యాచ్, ఫైనల్ మ్యాచ్‌లో భారత్ ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయినా.. రేణుకా సింగ్ బౌలింగ్ మాత్రం అంత తేలికగా ఎవరూ మర్చిపోలేరు. ఎందుకంటే తొలి మ్యాచ్‌లో అలిస్సా హీలీ, బెత్ మూనీ, మెగ్ లానింగ్, తహ్లియా మెక్‌గ్రాత్ ఇలా అగ్రశ్రేణి బ్యాటర్లను పెవిలియన్‌కు పంపింది. ఫైనల్లోనూ హేలీ, హ్యారిస్ వికెట్లు తీసింది. ఇక రెండో మ్యాచ్‌లో పాక్‌పై పొదుపు బౌలింగ్ చేసి కట్టడి చేసింది. భారత్‌కు చావోరేవో తేల్చుకోవాల్పిన మ్యాచ్‌లో బార్బడోస్ బ్యాటర్లను చుట్టేసింది. పవర్‌ప్లేలో 3 ఓవర్లు వేసి కేవలం ఐదు పరుగులు ఇచ్చి మూడు కీలకవికెట్లు పడగొట్టింది. మొత్తం 5 మ్యాచ్‌ల్లో.. 11 వికెట్లతో టాప్ వికెట్ టేకర్‌గా నిలిచింది.