ఐసీసీ తాజా టెస్టు ర్యాంకింగ్స్(ICC Test Rankings)ను బుధవారం ప్రకటించింది. భారత్-ఇంగ్లాండ్ సిరీస్లో భాగంగా జరిగిన రెండు టెస్టుల్లో ఆటగాళ్ల ప్రదర్శన ఆధారంగా కొత్త పాయింట్ల పట్టికను విడుదల చేసింది. రెండో మ్యాచ్లో సెంచరీ(129 పరుగులు) బాదిన టీమ్ఇండియా బ్యాట్స్మన్ కేఎల్ రాహుల్(559 పాయింట్లు) ఏకంగా 19 స్థానాలు మెరుగుపరుచుకుని 37వర్యాంకుకు చేరుకున్నాడు. కెప్టెన్ కోహ్లీ, రోహిత్ శర్మ, పంత్ ర్యాంకుల్లో ఏ మార్పు లేదు. వరుసగా ఐదు, ఆరు, ఏడు స్థానాల్లోనే ఉన్నారు. అయితే ఇంగ్లాండ్ కెప్టెన్ జోరూట్(893 పాయింట్లు) కోహ్లీని దాటి రెండో స్థానానికి దూసుకెళ్లాడు. ఇక, బ్యాట్స్మెన్ విభాగంలో అగ్రస్థానంలో న్యూజిలాండ్ సారథి కేన్ విలియమ్సన్( 901 పాయింట్లు), మూడు, నాలుగు ర్యాంకుల్లో ఆస్ట్రేలియా ప్లేయర్స్ స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్ ఉన్నారు.
బౌలింగ్ విభాగంలో బుమ్రా( 754 పాయింట్లు) పదో స్థానానికి పడిపోగా.. మహ్మద్ సిరాజ్(465) 18 స్థానాలు ఎగబాకి 38ర్యాంకులో నిలిచాడు. ఐదు వికెట్ల ప్రదర్శన చేసిన జేమ్స్ అండర్సన్ ఆరు, మార్క్ వుడ్ 37ర్యాంకులో ఉన్నాడు. ప్యాట్ కమిన్స్(ఆస్ట్రేలియా), రవిచంద్రన్ అశ్విన్(టీమ్ఇండియా), టిమ్ సౌథీ(న్యూజిలాండ్), జోష్ హెజిల్వుడ్(ఆస్ట్రేలియా), నీల్ వాగ్నర్(న్యూజిలాండ్) వరుసగా తొలి ఐదు స్థానాల్లో నిలిచారు.