డబ్ల్యూటీసీలో భాగంగా దక్షిణాఫ్రికా-వెస్టిండీస్ మధ్య జరిగిన టెస్ట్ సిరీస్ అనంతరం ఐసీసీ ర్యాంకింగ్స్‌ను ప్రకటించింది. ఆల్‌రౌండర్ల జాబితాలో టీమ్ఇండియా క్రికెటర్ రవీంద్ర జడేజా(386 పాయింట్లు) తొలి స్థానాన్ని దక్కించుకున్నాడు. 2017 ఆగస్టు తర్వాత జడ్డూ తిరిగి అగ్రస్థానానికి చేరుకోవడం ఇదే ప్రథమం. ర్యాంకింగ్స్‌కు ముందు ఈ స్థానంలో ఉన్న విండీస్ క్రికెటర్ జేసన్ హోల్డర్.. ప్రోటీస్ జట్టుతో ఓటమి అనంతరం 28 పాయింట్లు కోల్పోయాడు. 384 పాయింట్లతో రెండో స్థానానికి పడిపోయాడు. టీమ్ఇండియా తరఫున రవిచంద్రన్ అశ్విన్ నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు.
ఇక టెస్టు బ్యాట్స్‌మన్ జాబితాలో.. దక్షిణాఫ్రికా వికెట్‌కీపర్, బ్యాట్స్‌మన్ క్వింటన్ డికాక్.. టాప్-10లోకి దూసుకొచ్చాడు. ప్రస్తుత జాబితాలో పదో ర్యాంకుకు చేరుకున్నాడు. విండీస్‌పై 158 పరుగులు చేసిన డికాక్.. ప్రోటీస్ 2-0తో సిరీస్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. 2019 డిసెంబర్లో చివరిసారిగా డికాక్ టాప్-10లో ఉన్నాడు. ఈ జాబితాలో ఆసీస్ క్రికెటర్ స్టీవ్ స్మిత్ 891 పాయింట్లతో తొలి స్థానంలో ఉండగా.. భారత్ తరఫున విరాట్ కోహ్లీ 4వ స్థానంలో, రోహిత్ శర్మ 6, రిషభ్ పంత్ 7 స్థానాలలో కొనసాగుతున్నారు.