ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టీమ్ఇండియా ఆటగాళ్లు జోరు కొనసాగిస్తున్నారు. తాజా ర్యాంకింగ్స్‌లో భారత్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అగ్రస్థానానికి దూసుకెళ్లాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగు టెస్టుల సిరీస్ రెండో మ్యాచ్‌లో ఆరు వికెట్లతో రాణించిన అశ్విన్ పాయింట్ల పట్టికలో తొలి స్థానానికి చేరుకున్నాడు. 864 పాయింట్లతో టాప్ ర్యాంకుకు ఎగబాకాడు. 2015 తర్వాత టెస్టు బౌలర్స్ ర్యాంకింగ్స్‌లో అశ్విన్ అగ్రస్థానానికి చేరడం ఇది రెండోసారి.
రీసెంట్గా న్యూజిలాండ్- ఇంగ్లాండ్ మధ్య జరిగిన రెండో టెస్టులో ఇంగ్లీష్ ప్లేయర్ జేమ్స్ అండర్సన్ పెద్దగా మంచి ప్రదర్శన చేయకపోవడం.. రవిచంద్రన్ అశ్విన్‌కు బాగా కలిసి వచ్చినట్టైంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లీష్ జట్టు ఓడిపోయిన నేపథ్యంలో గత వారం నెం.1 టెస్టు బౌలర్‌గా అవతరించిన ఆండర్సన్ తన పాయింట్లు కోల్పోయి.. ఇప్పుడు రెండో ర్యాంకుకు పడిపోయాడు.
అప్పుడు రెండో ర్యాంకులో ఉన్న రవిచంద్రన్ అశ్విన్‌కు.. టాప్‌లో ఉన్న జేమ్స్ అండర్సన్‌కు మధ్య రెండు పాయింట్ల తేడా మాత్రమే ఉంది. ఈ క్రమంలోనే న్యూజిలాండ్‌తో రెండో టెస్టు మ్యాచ్ ముగిశాక.. అండర్సన్ ర్యాంకు కిందకి పడిపోవడం.. అశ్విన్ టాప్‌లోకి రావడం జరిగింది. ఇప్పుడు వీరిద్దరి మధ్య 5 పాయింట్ల తేడా మాత్రమే ఉంది. ప్రస్తుతం జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో.. అశ్విన్ తన జోరును కొనసాగిస్తే మరికొంత కాలం అతడు అగ్రస్థానంలో ఉండే అవకాశం ఉంటుంది. లేదంటే మళ్లీ రెండు లేదా మూడో స్థానాల్లోకి పడిపోయే ఛాన్స్ ఉంది.