Team India flies to Australia: టీమ్ఇండియా టీ20 వరల్డ్‌కప్ వేట కోసం ఆస్ట్రేలియా బయలుదేరి వెళ్లింది. ఓవైపు యంగ్ ఇండియా సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌కు సిద్ధమవుతున్న సమయంలోనే వరల్డ్‌కప్ ఆడే టీమ్ గురువారం తెల్లవారుజామున ముంబయి ఎయిర్‌పోర్ట్‌లో ఫ్లైట్ ఎక్కింది. 15 మంది సభ్యుల టీమ్ వెళ్లాల్సి ఉన్నా.. బుమ్రా దూరం కావడం, అతడి స్థానంలో ఇంకా ఎవరినీ తీసుకోకపోవడంతో 14 మందే ఆస్ట్రేలియాకు వెళ్లారు.
ఆస్ట్రేలియాకు వెళ్లిన తర్వాతే అక్కడి పరిస్థితులను బట్టి బుమ్రా స్థానంలో ఎవరిని తీసుకోవాలో నిర్ణయిస్తామని కెప్టెన్ రోహిత్ చెప్పిన విషయం తెలిసిందే. టీమ్ఇండియా ఆస్ట్రేలియా బయలుదేరే ముందు గ్రూప్ ఫొటో దిగింది. ఈ ఫొటోను బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్‌లో షేర్ చేసింది. "పిక్చర్ పర్ఫెక్ట్. మనం సాధిద్దాం టీమ్ఇండియా. వరల్డ్‌కప్, వచ్చేస్తున్నాం" అని బీసీసీఐ ఈ ఫొటోకు క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఫ్లైట్ ఎక్కే ముందు ఇండియన్ క్రికెటర్లు కూడా గ్రూపులుగా ఫొటోలు దిగారు. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా హర్షల్ పటేల్, యుజ్వేంద్ర చాహల్‌లతో కలిసి దిగిన ఫొటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. "ఆస్ట్రేలియా వెళ్తున్నాం. ఉత్సాహకరమైన రోజులు ముందున్నాయి" అంటూ చాహల్, హర్షల్‌ను ట్యాగ్ చేశాడు కోహ్లీ.