ICC T20 World Cup 2024 : క్రికెట్ ప్రియుల కోసం నెట్టింట ఓ తీయ్యటి కబురు ట్రెండింగ్ అవుతోంది. 2024 టీ 20 ప్రపంచకప్ తేదీలు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. వెస్టిండీస్, అమెరికా సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న ఈ మెగా టోర్నీ వచ్చే ఏడాది జూన్ 4 నుంచి 30 వరకు జరగనున్నట్లు సమాచారం. ఇక ఈ ప్రపంచకప్‌తో ఐసీసీ 2024 - 2031 మధ్య జరిగే టోర్నమెంట్ సైకిల్ కూడా మొదలవుతుంది.
T20 World Cup 2024 Venues : రెండు దేశాల్లో కలిపి మొత్తం పది స్టేడియాల్లో ఈ టోర్నమెంట్ మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. మొదటిసారి అమెరికా ఐసీసీ ఈవెంట్‌కు ఆతిథ్యం ఇవ్వనున్నంది. ఇటీవలె ఐసీసీ బృందం యూఎస్‌లోని స్టేడియాలను సందర్శించింది. అయితే అమెరికాలో మ్యాచ్‌లు నిర్వహించే కొన్ని వేదికలకు అంతర్జాతీయ హోదా లేదు. అందుకని ఐసీసీ.. వెస్టిండీస్, యూఎస్ఏ దేశాల క్రికెట్ బోర్డులతో చర్చలు జరిపి స్టేడియాలపై తుది నిర్ణయం తీసుకోనుంది.
అయితే ఐసీసీ.. 2024 టీ20 ప్రపంచకప్‌ను విండీస్‌తో పాటు అమెరికాలో నిర్వహించడానికి రెండు ప్రధాన కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. మొదటిది అమెరికాలో క్రికెట్‌కు ప్రాధాన్యం లభించే అవకాశం ఉంది. లాస్ ఏంజిల్స్‌లో 2028 ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్పించాలనే ప్రయత్నం రెండో కారణం. ఒకవేళ ఐసీసీ ప్లాన్ సక్సెస్ అయితే.. 2028 ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చూడవచ్చు.