తెలంగాణ

telangana

రవీంద్ర జడేజాకు షాక్​.. జరిమానా విధించిన ఐసీసీ

By

Published : Feb 11, 2023, 5:34 PM IST

టీమ్ఇండియా ఆల్​రౌండర్​ రవీంద్ర జడేజాకు షాక్​ తగిలింది. ఐసీసీ కోడ్​ ఆఫ్​ కండక్ట్​ రూల్స్​ను ఉల్లంఘించినందుకు జడ్డూకు ఐసీసీ జరిమానా విధించింది. దీంతో పాటు ఒక పాయింట్​ను డీమెరిట్​ చేసింది.

ravindra jadeja fined for applying cream
ravindra jadeja fined for applying cream

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో టీమ్ఇండియా బోణీ కొట్టింది. ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి టెస్టులో.. ఇన్నింగ్స్​ 132 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కాగా, ఈ మ్యాచ్​లో అద్భుత ప్రదర్శన చేసిన రవీంద్ర జడేజాకు షాక్ తగిలింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) జడేజాపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. కోడ్​ ఆఫ్​ కండక్ట్​ రూల్స్​ను ఉల్లంఘించినందుకు డీమెరిట్​ పాయింట్​తో పాటు అతడి మ్యాచ్​ ఫీజులో 25 శాతం కోత విధించింది. అంపైర్ల అనుమతి లేకుండా చేతి వేలికి అయింట్​మెంట్​ పూసుకున్నందుకు ఐసీసీ జడేజాను వివరణ కోరింది. అనంతరం జడ్డూ ఇచ్చిన వివరణపై ఐసీసీ అధికారులు సంతృప్తి వ్యక్తం చేసి.. అతడిని మందలిస్తూ మ్యాచ్​ ఫీజు కోతతో సరిపెట్టారు. కాగా, ఈ విషయంపై పెద్ద దుమారమే రేగింది. జడేజా బాల్ ట్యాంపరింగ్ చేశాడని ఆస్ట్రేలియా మీడియా, మాజీ క్రికెటర్లు ఆరోపణలు గుప్పించారు. భారత అభిమానులు అదే స్థాయిలో ఆరోపణలను తిప్పికొట్టారు.

ఈ ఘటనపై ఇరు జట్ల మాజీ క్రికెటర్లు కూడా స్పందించారు. అయితే, ఈ ఘటనపై ఐసీసీ స్పందిస్తూ.. బంతి ఆకారాన్ని మార్చేందుకు జడేజా ప్రయత్నం చేయలేదని.. అలా చేసేందుకు క్రీమ్​ను ఉపయోగించలేదని క్లారిటీ ఇచ్చింది. అంపైర్ల పర్మిషన్ లేకుండా ఆయింట్​మెంట్ రాసుకున్నందుకే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకున్నామని తెలిపింది. కాగా, టెస్టు తొలి రోజు ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 46వ ఓవర్ ముందు జడేజా.. తన వేలికి ఆయింట్‌మెంట్ పూసుకున్నాడు. ఇది టీవీ కెమెరాల్లో రికార్డైంది.
తొలి టెస్టులో జడేజా ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టి.. ప్లేయర్ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. అతడు మొదటి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు పడగొట్టడంతో పాటు 70 పరుగులు చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు పడగొట్టాడు. అయితే, ఏడాదిలో మరో రెండు డీమెరిట్ పాయింట్లు వస్తే ఓ మ్యాచ్ నిషేధం ఎదుర్కొవాల్సి ఉంటుంది.

ABOUT THE AUTHOR

...view details