ICC Player Of The Month April 2023 : ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప్రతి నెలా పురుషుల, మహిళా క్రికెట్ విభాగంలో ఒకరికి 'ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు'ను ప్రకటిస్తుంది. ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లో అద్భుత ప్రదర్శన చేసిన పాకిస్థాన్ ప్లేయర్ ఫఖర్ జమాన్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ (ఏప్రిల్) అవార్డు సొంతం చేసుకున్నాడు. ఇక మహిళల విభాగంలో థాయ్‌లాండ్ కెప్టెన్ నారుమోల్ చావాయి అవార్డు గెలుచుకుంది. నవంబర్ 2022 తర్వాత పాకిస్థాన్ క్రికెటర్ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు గెలుచుకోవడం ఇదే మొదటి సారి.
ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా అవార్డు పొందడంపై ఫఖర్ స్పందించాడు. 'ఈ నెల నా కెరీర్లో మరిచిపోలేనిది. రెండు వరుస సెంచరీలు సాధించడం నాకు ఎంతో సంతోషం కలిగించింది. అందులో నా ఫేవరెట్ మాత్రం రావల్పిండిలో 180 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవడం' అని చెప్పుకొచ్చాడు. కాగా, న్యూజింలాండ్తో రావల్పిండి వేదికగా జరిగిన మొదటి వన్డేలో న్యూజిలాండ్ విధించిన 289 టార్గెట్‌ను ఛేదించి 5 వికెట్ల తేడాతో పాక్ విజయం సాధించింది. ఇందులో ఫఖర్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 114 బంతుల్లో 117 పరుగులు బాదాడు. అదే వేదికలో జరిగిన రెండో మ్యాచ్‌లోనూ ఫఖర్ దంచికొట్టాడు. 144 బంతుల్లో 180* పరుగులు చేసి.. 337 భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన పాకిస్థాన్ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు.