టీమ్‌ఇండియా స్టార్ కోహ్లీ, కెప్టెన్ రోహిత్ శర్మ వన్డే ర్యాంకింగ్స్‌లో అదరగొట్టారు. స్వదేశంలో శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో అద్భుత ప్రదర్శన చేసిన ఈ ఇద్దరు తమ ర్యాంకులను మెరుగుపరచుకున్నారు. విరాట్ రెండు స్థానాలు ఎగబాకి.. ఆరో స్థానానికి చేరుకున్నాడు. మరోవైపు.. రోహిత్ ఒక స్థానం మెరుగుపరచుకుని ఎనిమిదో స్థానంలో నిలిచాడు. కాగా, తొలి మ్యాచ్‌లో హిట్‌మ్యాన్.. 67 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 83 పరుగులు చేశాడు. ఇక వన్‌డౌన్ బ్యాటర్‌గా వచ్చిన విరాట్.. 87 బంతుల్లో 12 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 113 పరుగులు సాధించాడు. తద్వారా వన్డేల్లో 45వ సెంచరీ, ఓవరాల్‌గా అంతర్జాతీయ కెరీర్‌లో 73వ శతకం తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ అద్భుత ప్రదర్శనతోనే తమ ర్యాంకుల్లో ముందుకెళ్లారు.
ఇక ఈ ర్యాంకింగ్స్‌లో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం అగ్ర స్థానంలో కొనసాగుతున్నాడు. తర్వాతి స్థానాల్లో రాసి వాన్ డెర్ డసెన్ (సౌతాఫ్రికా), ఇమామ్ ఉల్ హక్(పాకిస్థాన్), క్వింటన్ డి కాక్ (సౌతాఫ్రికా), డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా) ఉన్నారు. ఇక లంకతో తొలి వన్డేలో ఘన విజయం సాధించిన టీమ్‌ఇండియా సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో ఉంది. బౌలింగ్ విభాగం విషయానికొస్తే.. శ్రీలంకపై మొదటి వన్డేలో రెండు వికెట్లు పడగొట్టిన మహ్మద్ సిరాజ్ నాలుగు స్థానాలు మెరుగైన 18వ స్థానంలో నిలిచాడు. ఆల్‌రౌండర్ల విభాగంలో టాప్-20లో కూడా టీమ్‌ఇండియా నుంచి ఒక్క ఆటగాడు లేకపోవడం గమనార్హం.