ICC Rankings ODI: ఇటీవల జింబాబ్వేతో ముగిసిన వన్డే సిరీస్‌లో రాణించిన టీమ్‌ఇండియా ఆటగాడు శుభమన్ గిల్ బుధవారం ఐసీసీ విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో ఏకంగా 45 స్థానాలు ఎగబాకాడు. ప్రస్తుతం అతడు 38వ స్థానంలో ఉన్నాడు. జింబాబ్వేతో జరిగిన 3 వన్డేల సిరీస్‌లో గిల్ 245 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్‌కు విశ్రాంతి తీసుకున్న విరాట్ కోహ్లీ ఐదో స్థానంలో, కెప్టెన్ రోహిత్ శర్మ ఆరో స్థానంలో ఉన్నారు. పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ అగ్ర స్థానంలో కొనసాగుతుండగా.. సౌతాఫ్రికా ప్లేయర్ డస్సెన్ తర్వాతి స్థానంలో ఉన్నాడు. ఇక బౌలింగ్ విభాగానికొస్తే.. న్యూజిలాండ్ స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ తొలి స్థానంలో, బుమ్రా నాలుగో స్థానంలో ఉన్నాడు. ఆల్‌రౌండర్ల విభాగంలో బంగ్లాదేశ్ ప్లేయర్ షకీబ్ అల్ హసన్ అగ్ర స్థానంలో ఉన్నాడు.
టెస్టు ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. బ్యాటింగ్ విభాగంలో టాప్ 10లో భారత్ నుంచి రిషభ్ పంత్ 5వ స్థానంలో, రోహిత్ శర్మ 9వ స్థానంలో ఉన్నారు. ఇంగ్లాండ్ ఆటగాడు జో రూట్ అగ్రస్థానంలో ఉన్నాడు. బౌలింగ్ విభాగంలో ప్యాట్ కమిన్స్ మొదటి స్థానంలో, రవిచంద్రన్ అశ్విన్ రెండో స్థానంలో ఉన్నారు. ఇటీవల ఇంగ్లాండ్‌తో జరిగిన మొదటి టెస్టులో రాణించిన కగిసో రబాడ రెండు స్థానాలు మెరుగుపర్చుకుని మూడో స్థానానికి చేరుకున్నాడు. ఆల్‌రౌండర్ల విభాగంలో జడేజా టాప్‌లో ఉండగా.. అశ్విన్ రెండో స్థానంలో ఉన్నాడు.