ICC New Rules : క్రికెట్ రూల్స్‌లో మార్పులు చేసింది ఐసీసీ. బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ నేతృత్వంలోని పురుషుల క్రికెట్ కమిటీ చేసిన సిఫార్సులను చీఫ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆమోదించింది. ఎంసీసీ 2017 క్రికెట్ కోడ్ చట్టాల మూడో ఎడిషన్ అప్‌డేషన్ల గురించి గంగూలీ నేతృత్వంలోని కమిటీ చర్చించి కొత్త ప్రతిపాదనలు చేసింది. అక్టోబర్ 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ఆ మార్పులు ఏంటంటే..
- బ్యాటర్ క్యాచ్ అవుట్ అయితే.. స్ట్రయికర్ ఉన్న స్థానంలోకే కొత్త బ్యాటర్ వస్తారు. క్యాచ్ పట్టే సమయంలో బ్యాటర్లు ఒకరినొకరు క్రాస్ చేసినా పరిగణనలోకి తీసుకోరు.
- బాల్‌కు ఉమ్మి రాయడంపై ఇప్పటికే తాత్కాలిక నిషేధం అమల్లో ఉంది. కొవిడ్ పరిస్థితుల్లో ఈ నిబంధన గత రెండేళ్లుగా అంతర్జాతీయ క్రికెట్‌లో అమలు చేస్తున్నారు. ఇప్పుడూ దీన్ని శాశ్వతం చేయడంతో.. ఇకపై బంతికి ఉమ్మిని రాయడం కుదరదు.
- టెస్టులు, వన్డేల్లో ఇన్‌కమింగ్ బ్యాటర్ రెండు నిమిషాల్లోనే స్ట్రైక్ తీసుకోవడానికి సిద్ధం కావాలి. టీ 20ల్లో ఇందుకోసం ఉన్న 90 సెకన్ల సమయంలో ఎలాంటి మార్పు లేదు.
- బౌలర్ బౌలింగ్ చేస్తున్న సమయంలో.. ఫీల్డింగ్‌లో ఏదైనా ఉద్దేశపూర్వకమైన, అనైతిక కదలికలు చోటుచేసుకుంటే ఆ బాల్‌ను డెడ్ బాల్‌గా ప్రకటిస్తారు. దీంతో అంపైర్ బ్యాటింగ్ జట్టుకు పెనాల్టీ రూపంలో ఐదు పరుగులు ఇవ్వొచ్చు.
- 'మన్కడింగ్' రూపంలో చేసే రనౌట్‌ను ఇక మీదట 'అన్‌ఫెయిర్ ప్లే' సెక్షన్ నుంచి 'రన్ అవుట్' సెక్షన్‌లోకి మార్చారు.
- బౌలర్ బాల్ వేయకముందే బ్యాటర్ వికెట్ల నుంచి కాస్త ముందుకు జరిగి ఆడేందుకు ప్రయత్నిస్తే.. బంతిని విసిరి స్ట్రైకర్‌ను రనౌట్ చేసేవారు. ఇప్పుడు ఇలాంటి ప్రయత్నం చేస్తే దాన్ని డెడ్ బాల్‌గా ప్రకటిస్తారు.
- టీ20ల్లో జనవరి 2022లో ప్రవేశపెట్టిన మ్యాచ్ పెనాల్టీని వన్డేలకు కూడా అమలు చేయనున్నారు. దీంతో వన్డేల్లోనూ నిర్ణీత సమయంలో ఓవర్లు పూర్తి చేయకపోతే.. ఆ మిగిలిన ఓవర్లలో బౌండరీ దగ్గర నుంచి 30 యార్డ్స్ సర్కిల్‌లోకి ఫీల్డర్‌ను తీసుకురావాల్సి ఉంటుంది. 2023లో ఐసీసీ పురుషులు వరల్డ్ కప్ లీగ్ పూర్తయిన అనంతరం ఇది అమలులోకి రానుంది.
- బౌలర్ వేసే బంతిని ఆడేటప్పుడు బ్యాట్ కొంత భాగమైనా లేదంటే బ్యాటర్ పిచ్‌పైనే ఉండాలి. అలా కాకుండా పిచ్ బయటకు వచ్చి ఆడితే.. దానిని డెడ్ బాల్‌గా పరిగణిస్తారు. ఒకవేళ బౌలర్ వేసిన బంతి బ్యాటర్‌ను పిచ్ బయటకు రప్పించేలా ఉంటే.. నోబాల్‌గా ప్రకటిస్తారు.