2022 ఐసీసీ టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఎంపికయ్యాడు. గతేడాది మైదానంలో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న స్కైను ఈ ప్రతిష్టాత్మక అవార్డు కోసం ఎంపిక చేసినట్లు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) బుధవారం ప్రకటించింది. 2022లో ఈ క్రికెటర్ ఆడిన 31 మ్యాచ్‌ల్లో 187.43 స్ట్రైక్‌రేటుతో 1164 పరుగులు సాధించాడు. ఇందులో రెండు సెంచరీలు, తొమ్మిది హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
ICC టీ20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్‌గా సూర్య.. ఈ 'స్కై'కి ఆకాశం కూడా హద్దు కాదు! - సూర్య కుమార్ యాదవ్ స్టాట్స్
ఐసీసీ టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ సూర్య కుమార్ యాదవ్ నిలిచాడు. మైదానంలో తన అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకునే ఈ స్టార్ ప్లేయర్‌కు ఈ అవార్డు దక్కడంతో ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
గతేడాది జరిగిన పలు కీలక మ్యాచ్‌ల్లో టీమ్ ఇండియాను విజేతగా నిలపడంలోనూ తనదైన పాత్ర పోషించాడు సూర్యకుమార్. అలా ఐసీసీ టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచాడు. ఇంతే కాకుండా తన లిస్ట్‌లో ఎన్నో రికార్డులున్నాయి. ఒక క్యాలెండర్ ఇయర్‌లో వెయ్యి కంటే ఎక్కువ పరుగులు చేసిన రెండో బ్యాటర్‌గా నిలిచాడు. 68 సిక్సర్లు బాది పొట్టిఫార్మాట్లో ఏడాది కాలంలో అత్యధిక సిక్స్‌లు కొట్టిన ఆటగాడిగానూ సూర్య కుమార్ రికార్డుకెక్కాడు.
టీ20 ప్రపంచకప్ టోర్నీలో
ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 వరల్డ్‌కప్‌లోనూ సూర్య కుమార్ చెలరేగిపోయాడు. ఆరు ఇన్నింగ్స్‌లో మూడు హాఫ్ సెంచరీలు సాధించిన ఈ స్టార్ ప్లేయర్ 189కు పైగా స్ట్రైక్‌రేటుతో దుమ్మురేపాడు. ఆ తర్వాత జరిగిన న్యూజిలాండ్ ద్వైపాక్షిక సిరీస్‌లో సెంచరీ నమోదు చేశాడు. ఈ క్రమంలో 890 రేటింగ్ పాయింట్లతో ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకున్నాడు. కాగా గతేడాది జులైలో ఇంగ్లండ్‌తో జరిగిన నాటింగ్‌హాం మ్యాచ్‌లో సూర్య తన కెరీర్‌లో తొలి అంతర్జాతీయ శతకం బాదాడు. ఉత్కంఠంగా జరిగిన ఆ మ్యాచ్‌లో కేవలం 55 బంతుల్లోనే 117 పరుగులు సాధించి సంచలనాన్ని సృష్టించాడు స్కై. తాజాగా ఐసీసీ అవార్డు గెలుచుకోవడం వల్ల అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ స్కైకి ఆకాశం కూడా హద్దు కాదని ట్వీట్లు చేస్తున్నారు.