ICC Hall Of Fame 2023 Virendra Sehwag : టీమ్ఇండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్, భారత మాజీ టెస్ట్ క్రికెటర్ డయానా ఎడల్జీ (Diana Edulji ), శ్రీలంక స్టార్ క్రికెటర్ అరవింద డిసిల్వా.. ప్రతిష్ఠాత్మక ఐసీసీహాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కించుకున్నారు. ఈ మేరకు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్- ఐసీసీ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ వేదికగా ప్రకటించింది. ముంబయిలోని వాంఖడే స్టేడియం వేదికగా నవంబర్ 15న జరగనున్న భారత్ - న్యూజిలాండ్ సెమీ ఫైనల్స్ మ్యాచ్‌లో వీరిని ఐసీసీ సన్మానించనుంది.
Virendra Sehwag Career : భారత్ క్రికెట్ దిగ్గజం వీరేంద్ర సెహ్వాగ్ 2011 ప్రపంచ కప్‌లో టీమ్ఇండియా గెలుపులో కీలక పాత్ర పోషించాడు. మొత్తం 23 టెస్ట్ సెంచరీలు చేశాడు. టెస్టుల్లో 2008లో సౌతాఫ్రికాపై సెహ్వాగ్ చేసిన 319 పరుగులే ఇండియా తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోరు కావడం విశేషం. 2011లో వెస్టిండీస్ పై జరిగిన వన్డేలో సెహ్వాగ్ 219 రన్స్ చేశాడు. ఇప్పటికీ వన్డే క్రికెట్ చరిత్రలో రోహిత్ (264), మార్టిన్ గప్టిల్ (237) తర్వాత మూడో అత్యధిక వ్యక్తిగత స్కోరు వీరూదే కావడం విశేషం. వన్డేల్లో మొత్తంగా అతడు 8273 రన్స్ చేశాడు.
Diana Edulji Career : టీమ్ఇండియా మాజీ మహిళా క్రికెటర్ డయానా ఎడుల్జీ.. తన 17 సంవత్సరాల కెరీర్లో భారత్ తరఫున 54 మ్యాచ్‌లు ఆడారు. అంతే కాకుండా ఆమె 100 వికెట్లకు పైగా తీసి క్రికెట్ చరిత్రలో తన పేరు లిఖించుకున్నారు. పశ్చిమ రైల్వేలో అడ్మినిస్ట్రేటర్‌గా ఆమె పనిచేశారు. ఈ క్రమంలో ప్రతిభావంతులైన మహిళా క్రికెటర్లకు ఉపాధి అవకాశాలను పెంచడానికి తన వంతు కృషి చేశారు. అంతే కాకుండా ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కించుకున్న తొలి మహిళా క్రికెటర్ కూడా ఈమెనే కావడం విశేషం.