ICC Championship 2025 : 2025 ఛాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యం ఇవ్వడం కోసం పాకిస్థాన్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. షెడ్యూల్ ప్రకారం ఈ టోర్నీకి పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వాల్సి ఉన్నా.. ఇంకా ఐసీసీ.. హోస్టింగ్ అగ్రీమెంట్‌పై సంతకం చేయలేదు. ఈ నేపథ్యంలో ఆ దేశానికి గట్టి షాక్ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి.
ఒకవేళ వచ్చే ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్థాన్‌లో జరిగితే.. భద్రతా కారణాల దృష్ట్యా భారత జట్టు ఆ దేశంలో పర్యటించక పోవచ్చని విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఇదే నిజమైతే టోర్నీ హైబ్రిడ్‌లో జరిగే అవకాశాలున్నాయని వార్తలు వస్తున్నాయి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ఐస్లాండ్ క్రికెట్ బోర్డు రెడీ అయింది. ఈ మేరకు తాజాగా ఐసీసీకి ఓ లేఖ రాసింది. రానున్న ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ హక్కులు తమకు ఇవ్వాలంటూ ట్విట్టర్ వేదికగా ఐసీసీకి విజ్ఞప్తి చేసింది.
"2025లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యం ఇవ్వడానికి ఐస్‌లాండిక్ క్రికెట్ అసోసియేషన్ ఆసక్తి కనబరుస్తోంది. పాకిస్థాన్‌లో టోర్నమెంట్ జరగదన్న రూమర్స్ నేపథ్యంలో మేము ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నాము. హైబ్రిడ్ మోడల్లో ఈ టోర్నీ ఉంటుందన్న విషయం తెలిసింది. ఇక అద్భుతమైన టోర్నమెంట్‌ను నిర్వహించేందుకు ఉపయోగపడే రాతి నేల మా దగ్గర ఉంది. అంతే కాకుండా అగ్నిపర్వతాల ద్వారా ఏర్పడ్డ ఒక రకమైన మట్టి.. నేలపై పడిన నీటిని త్వరగా పీలుస్తుంది. ఆసియా ఖండంలో కనిపించే పేలవమైన డ్రైనేజీలు సమస్యలు ఇక్కడ లేవు" అంటూ ఆ లెటర్లో తమ అభిప్రయాన్ని వ్యక్తపరిచింది. అంతే కాకుండా "మేము వెనక్కి తగ్గేవాళ్లం కాదు. ఈరోజు మేము ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఆతిథ్యం కోసం బిడ్ వేశాం. గ్రెగ్ బార్‌క్లే బృందం ఈ విషయంపై ఇచ్చే సమాధానం కోసం ఎదురుచూస్తున్నాం" అంటూ ఆ లెటర్‌కు క్యాప్షన్‌ను జోడించింది.