ICC Awards: బౌలర్‌కు అడ్డుపడ్డానని భావించి సులువైన పరుగు తీయకుండా వెనక్కు తగ్గాడు న్యూజిలాండ్ ఆటగాడు డెరిల్ మిచెల్. ఈ ఘటన గతేడాది జరిగిన ఐసీసీ ప్రపంచకప్‌లో జరిగింది. మిచెల్ చర్యను అభినందిస్తూ తాజాగా ఐసీసీ 'స్పిరిట్ ఆఫ్ ది క్రికెట్' అవార్డును ప్రకటించింది. ఈ అవార్డు తనకు దక్కడంపై హర్షం వ్యక్తం చేశాడు మిచెల్.
ఇదీ జరిగింది..
అది టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్. గతేడాది నవంబరు 10 అబుదాబి వేదికగా న్యూజిలాండ్-ఇంగ్లాండ్ మధ్య హోరాహోరీగా మ్యాచ్ జరుగుతోంది. లక్ష్య ఛేదనలో భాగంగా 17 ఓవర్లు పూర్తయిన సమయానికి కివీస్ 4 వికెట్లు కోల్పోయి 133 పరుగులు చేసింది. అదిల్ రషీద్ 18వ ఓవర్ తొలిబంతిని వేశాడు. స్ట్రైక్‌లో ఉన్న జేమ్స్ నీషమ్ లాంగ్ ఆఫ్వైపు బంతిని బాది పరుగుకు ప్రయత్నించాడు. అయితే బంతిని ఆపేందుకు బౌలర్ రషీద్ ప్రయత్నిస్తున్న క్రమంలో అనుకోకుండా మిచెల్ అడ్డువచ్చాడు. దీంతో రషీద్‌కు అడ్డుపడ్డానని భావించి నీషమ్‌ను వెనక్కు వెళ్లమన్నాడు మిచెల్.
కానీ ఆ తర్వాత మిచెల్-నీషమ్ ద్వయం అద్భుతమైన బ్యాటింగ్‌తో జట్టుకు విజయాన్ని అందించింది.