IBSA World Games 2023 Cricket :అంధులైతేనేం.. ఈ ప్రపంచాన్ని తమ మనోనేత్రంతో జయించి విశ్వవేదికపై భారత త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించారు. అంగవైకల్యం ఉన్నా.. తాము ప్రతిభలో ఎవరికి తీసిపోమని ఘనంగా చాటిచెప్పారు. ప్రోత్సహించి కాస్త అండగా ఉంటే చాలు పతకాలతో దేశ కీర్తి, ప్రతిష్టల మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తామని చేతల్లో చూపించారు. వారే భారత అంధుల మహిళల క్రికెట్ జట్టు ప్లేయర్లు.
బర్మింగ్హమ్ వేదికగా ఇంటర్నేషనల్ బ్లైండ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ (ఐబీఎస్ఏ) ప్రపంచ క్రికెట్ క్రీడల ఫైనల్స్‌లో.. ఈ భారత అంధుల మహిళల క్రికెట్ జట్టు ప్లేయర్లు అద్భుత విజయం సాధించారు. ఫలితంగా ట్రోఫీని ముద్దాడ్డారు. శనివారం తుదిపోరులో ఆస్ట్రేలియా అంధుల మహిళలతో తలపడిన భారత మహిళలు 9 వికెట్ల తేడాతో నెగ్గి.. గోల్డ్ మెడల్ సాధించారు. ఈ విజయంతో భారత్ ఐబీఎస్ఏ వరల్డ్ గేమ్స్‌లో తొలి ఛాంపియన్‌గా భారత అంధుల జట్టు చరిత్ర సృష్టించింది.
టీ20 ఫార్మాట్లో జరిగిన ఈ పోరులో భారత మహిళల జట్టు.. తొలుత బ్యాటింగ్ చేసిన ప్రత్యర్థి ఆసిస్‌ను తక్కువ పరుగులకే కట్టడి చేసింది. దీంతో ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 114 పరుగులు చేసింది.అనంతరం పలుమార్లు వర్షం మ్యాచ్‌కు ఆటంకం కలిగించింది. దీంతో మ్యాచ్ నిర్వాహకులు భారత్ లక్ష్యాన్ని.. తొమ్నిది ఓవర్లలో 42 పరుగులకు కుదించారు. ఈ టార్గెట్‌ను టీమ్ఇండియా ఒక వికెట్ కోల్పోయి 3.3 ఓవర్లలో ఛేదించి ప్రపంచ ఛాంపియన్‌గా అవతరిచింది.