ఒక వేళ ఐపీఎల్ నిరవధిక వాయిదా పడి ఉండకపోతే.. తాను లీగ్ నుంచి విరామం తీసుకునేవాడినని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ వెల్లడించాడు. తన తల్లిదండ్రులకు కొవిడ్ పాజిటివ్ అని తెలియగానే ఆటపై శ్రద్ధ పెట్టలేకపోయినట్టు పేర్కొన్నాడు. వీలైనంత తొందరగా ఇంటికి వెళ్లాలని యోచించినట్లు తెలిపాడు.
"నా తల్లిదండ్రులకు కరోనా సోకిందని తెలియగానే.. ఐపీఎల్ నుంచి విరామం తీసుకోవాలని అనుకున్నాను. ఇంటి దగ్గర వాళ్లు ఒంటరిగా ఉన్న సమయంలో ఇలా జరిగితే ఆటపై దృష్టి సారించడం చాలా కష్టమవుతుంది. మే 3న వారిద్దరికీ వైరస్ నిర్ధరణ అయింది. తర్వాత రోజే లీగ్‌ను నిరవధిక వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది."
-యుజ్వేంద్ర చాహల్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్.
ఇటీవలే కొవిడ్ నుంచి తన తల్లి కోలుకున్నప్పటికీ.. తన తండ్రి పరిస్థితి మాత్రం క్షీణించిందని చాహల్ వెల్లడించాడు. ఆయనను గుర్గాన్లోని ఆస్పత్రిలో చేర్చినట్లు తెలిపాడు.
ఇదీ చదవండి:కరోనాతో ఏఎఫ్ఐ మెడికల్ ఛైర్మన్ మృతి
"మా నాన్న ఆక్సిజన్ లెవెల్స్ 85-86కి పడిపోయాయి. దీంతో ఆయనను ఆస్పత్రికి తరలించాము. నిన్ననే అక్కడి నుంచి తీసుకొచ్చాం. అయినప్పటికీ, అతనికి వైరస్ ఉన్నట్లు తేలింది. ఏదేమైనా అతని ఆక్సిజన్ లెవెల్స్ 95-96కి చేరుకోవడం శుభపరిణామం. ఇది కొంత ఉపశమనం ఇచ్చింది. ఆయన మెరుగవ్వడానికి ఇంకో 7-10 రోజుల సమయం పట్టే అవకాశం ఉంది" అని చాహల్ తెలిపాడు.
ఐపీఎల్ 14ల సీజన్లో వరుసగా కరోనా కేసులు బయటపడ్డాయి. పలువురు క్రికెటర్లతో పాటు సహాయక సిబ్బందికి కొవిడ్ నిర్ధరణ అయింది. దీంతో లీగ్‌ను నిరవధిక వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది.
ఐపీఎల్ వాయిదా పడిన నేపథ్యంలో లీగ్ నిర్వహణకు యూఏఈ ప్రత్యామ్నాయ వేదిక అని చాహల్ అభిప్రాయపడ్డాడు. సెప్టెంబర్‌లో మిగిలిన లీగ్‌ను జరపాలని బీసీసీఐ కూడా భావిస్తోన్నట్లు తెలిపాడు. భారత్ నుంచి ఆతిథ్య వేదిక యూఏఈకి తరలిపోయినా.. టీ20 ప్రపంచకప్ గెలిచే సత్తా భారత్‌కు ఉందని చాహల్ పేర్కొన్నాడు.
ఇదీ చదవండి:ఐపీఎల్ కోసం బీసీసీఐ విశ్వప్రయత్నాలు.. ఎందుకు?