Virat Kohli Rahul Dravid Interview : సుమారు 1200 రోజుల తర్వాత టెస్ట్ క్రికెట్లో సెంచరీ చేశాడు టీమ్‌ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ. ఇటీవలే బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో 186 పరుగులతో భారీ శతకం కొట్టాడు. దీంతో టెస్టుల్లో 28వ శతకం నమోదు చేశాడు. ఆ టెస్టు డ్రాగా ముగియడం వల్ల ట్రోఫీని 2-1 తేడాతో సొంతం చేసుకుంది భారత్. అయితే ఈ మ్యాచ్ ముగిసిన అనంతరం భారత ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్‌తో చిట్ చాట్ చేశాడు విరాట్ కోహ్లీ. ఈ సందర్భంగా కోహ్లీతో మాట్లాడిన ద్రవిడ్.. 'మూడేళ్ల పాటు టెస్టుల్లో సెంచరీ చేయకపోవడం కష్టంగా అనిపించిందా' అని ప్రశ్నించాడు.
"నిజంగా చెప్పాలంటే.. నా సొంత తప్పిదాలే చాలా కాలంపాటు నన్ను సెంచరీకి దూరంగా ఉండేలా చేశాయి. మూడంకెల మార్క్‌ని సాధించాలనే తపన ఒక బ్యాటర్‌గా మీలో కూడా ఉంటుందని అనుకుంటున్నా. మనమందరం ఏదో ఒక దశలో ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నాం. కానీ నా విషయంలో మాత్రం అది కాస్త ఎక్కువ కాలంపాటు కొనసాగిందని భావిస్తున్నా. నేను 40 లేదా 45 పరుగులతో సంతోషంగా ఉండే ఆటగాడిని కాదు. ఈ మ్యాచ్‌లో నేను 40 పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఇక్కడ 150 పరుగులు చేయగలనని.. ఆ పరుగులు నా జట్టుకు చాలా ఉపయోగపడతాయని తెలుసు. ఇలాంటి క్లిష్టమైన సమయాల్లో జట్టు కోసం మంచి ప్రదర్శన చేసినపప్పుడల్లా నేను ఎంతో గర్వపడతాను"
---విరాట్ కోహ్లీ, టీమ్‌ఇండియా స్టార్ బ్యాటర్