త్వరలో ప్రారంభమయ్యే నాలుగో టెస్టు కోసం టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ భారీ మార్పులతో బరిలోకి దిగుతాడని ఆశించొద్దని పాకిస్థాన్ మాజీ ఆటగాడు సల్మాన్ భట్ అన్నాడు.
'జట్టులోకి కొత్తగా ఎవరిని తీసుకున్నా.. కుదురుకోవడానికి కొంత సమయం పడుతుంది. అందుకే ఇదే జట్టుతో మిగతా మ్యాచులు ఆడవచ్చు. ఇటీవల కౌంటీ క్రికెట్‌లో అదరగొట్టిన సీనియర్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. అదనపు బ్యట్స్‌మెన్‌తో బరిలోకి దిగే ఉద్దేశమేమీ లేదని కోహ్లీనే స్పష్టం చేశాడు. కాబట్టి, పెద్దగా మార్పులు ఉండవు. మూడో టెస్టు ముగిసిన అనంతరం కోహ్లీ స్పందించిన తీరుని చూస్తే.. ఓవల్లో జరగబోయే నాలుగో టెస్టుకు పెద్దగా మార్పులేమి చేయకపోవచ్చనిపించింది. ఆటగాళ్ల వ్యక్తిగత ప్రదర్శన గురించి అతడు మాట్లాడలేదు. జట్టు సమష్టి కృషి గురించే మాట్లాడాడు. ఇంగ్లాండ్‌తో సిరీస్ ముగిసిన తర్వాతే మార్పుచేర్పులు చేయవచ్చు" అని సల్మాన్ చెప్పాడు.