How to Become a Sportsman: పదేళ్ల క్రితం ఊబకాయంతో బాధపడుతున్న ఆ బాలుడిని ఎగతాళి చేసిన స్నేహితులకు తెలీదు అతనే ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలుస్తాడని! పదేళ్ల వయసులో దిల్లీలోని గల్లీల్లో బ్యాట్‌తో వీరంగం సృష్టించిన ఆ బాలుడు.. టీమ్‌ఇండియాను నడిపిస్తాడని ఎవరూ ఊహించి ఉండరు! ఎనిమిదేళ్ల వయసులో శిక్షణ కోసం రోజూ 56 కిలోమీటర్లు ప్రయాణించిన ఆ అమ్మాయి.. వరుసగా రెండు ఒలింపిక్స్‌ల్లో పతకాలతో చరిత్ర సృష్టిస్తుందని ఎవరూ అనుకోని ఉండరు! వాళ్లే.. నీరజ్ చోప్రా, విరాట్ కోహ్లీ, పీవీ సింధు. వాళ్లు ఈ స్థాయికి చేరడానికి కారణం ఆటలు. అవును.. ఆటలు ఎంతోమందికి జీవితాన్నిచ్చాయి. ఆటలాడిన ప్రతి ఒక్కరూ మైదానంలో విజేతలు కావొచ్చు.. కాకపోవచ్చు. కానీ జీవితంలో మాత్రం ఛాంపియన్‌లుగా నిలుస్తారు.
గత కొంత కాలంగా క్రీడారంగంలో పెను మార్పులు వస్తున్నాయి. అందుకు తగినట్లుగా తమ పిల్లలను ఆటల వైపు నడిపించేలా తల్లిదండ్రుల దృక్పథం మారుతోంది. వెన్నుతట్టి ప్రోత్సహించే వాళ్లు.. అత్యుత్తమ శిక్షణ వసతులు అందుబాటులో ఉంటే.. ఆటలో అడుగుపెట్టి.. అద్భుత ప్రదర్శనతో ఛాంపియన్లవొచ్చు. ప్రతి ఒక్కరూ ఓ సింధు.. ఓ నీరజ్ చోప్రా.. ఓ కోహ్లి కాలేకపోవచ్చు. కానీ జీవితంలో కచ్చితంగా ఛాంపియన్‌గా ఎదుగుతారు. ఏ పాఠశాలలో, కళాశాలలో బోధించని ఎన్నో విషయాలను క్రీడలు నేర్పిస్తాయి. వ్యక్తిత్వ వికాసానికి దోహదం చేస్తాయి.
దూసుకెళ్లండిలా..
తమ పిల్లలను ఛాంపియన్లుగా చూడాలని తపనపడే తల్లిదండ్రులు అందుకు సరైన మార్గం కోసం అన్వేషిస్తుంటారు. వాళ్ల చుట్టూనే ఎన్నో అవకాశాలుంటాయి. ముందు తమ పిల్లలు ఏ క్రీడపై ఆసక్తి చూపిస్తున్నారో తెలుసుకోగలగాలి. ప్రభుత్వంతో పాటు ప్రైవేటు అకాడమీల ఆధ్వర్యంలో వేసవి శిక్షణ శిబిరాలు నిర్వహిస్తుంటారు. అందులో తమ పిల్లాడు ఏ క్రీడలో ప్రతిభ చూపుతున్నాడో గమనించాలి. మరోవైపు తమ జిల్లా కేంద్రాల్లో ప్రభుత్వాల ఆధ్వర్యంలో నడిచే శిక్షణా కేంద్రాలుంటాయి. వాటిలో తమ పిల్లలను చేర్చవచ్చు.
తెలుగు రాష్ట్రాల్లో క్రీడా పాఠశాలలున్నాయి. తెలంగాణలోని హకీంపేట్‌లో, కరీంనగర్, ఆదిలాబాద్‌లో, ఏపీలోని కడపలో క్రీడా పాఠశాలలున్నాయి. వీటిల్లో నాలుగో తరగతిలోకి ప్రవేశాలుంటాయి. మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో 8 నుంచి 10 ఏళ్లలోపు విద్యార్థులను పరీక్షల ద్వారా ఈ పాఠశాలల్లోకి తీసుకుంటారు. ఇంటర్మీడియట్ వరకు ఆటలో శిక్షణ తీసుకుంటూ చదువుకోవచ్చు. మరోవైపు మండల స్థాయి నుంచి వివిధ వయసు విభాగాల్లో వేర్వేరు క్రీడా సంఘాలు తమ ఆటల్లో టోర్నీలు నిర్వహిస్తాయి. అందులో ఉత్తమ ప్రదర్శన చేసిన ఆటగాళ్లను తర్వాతి స్థాయికి ఎంపిక చేస్తాయి.