ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే చర్చ!.. ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్‌లో టీమ్‌ఇండియా విజయం సాధిస్తుందా? లేదా?.. ఎందుకంటే ఈ సిరీస్ విజయం మనకు ముఖ్యం కాదు. కానీ నాలుగో టెస్ట్ విజయమే అతి ముఖ్యమైన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్‌కు వెళ్లేందుకు టీమ్ఇండియాకు కీలకంగా మారనుంది.
ప్రస్తుతం ప్రతిష్ఠాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా నాలుగు టెస్టుల సిరీస్‌లో భారత్ 2-1 ఆధిక్యంలో కొనసాగుతోంది. అహ్మదాబాద్ వేదికగా చివరి టెస్టు జరుగుతోంది. ఈ క్రమంలో సిరీస్ ఎలాగూ భారత్ నుంచి చేజారే అవకాశం లేదు. మ్యాచ్ డ్రా అయినా సిరీస్ మనదే అవుతుంది. కానీ, వరుసగా రెండోసారి ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేరుకోవాలంటే మాత్రం భారత్‌కు విజయం అవసరం.
నాలుగో టెస్టులో గెలిస్తే.. ఇప్పటికే డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరిన ఆసీస్‌తోనే తలపడేందుకు సిద్ధమైపోవచ్చు. కానీ, ఒకవేళ ఓడినా, మ్యాచ్ డ్రా అయినా.. ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. ఇప్పుడున్న గందరగోళానికి తెరపడాలంటే సోమవారం వరకు ఆగాల్సిందే. ఎందుకంటే భారత్ - ఆసీస్ నాలుగో టెస్టుతోపాటు న్యూజిలాండ్ - శ్రీలంక తొలి టెస్టు చివరి రోజు వరకు వెళ్లింది.
- నాలుగో టెస్టులో ఆసీస్‌పై భారత్ విజయం సాధిస్తే.. టెస్టు సిరీస్ సొంతం చేసుకోవడంతోపాటు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్‌కు టీమ్‌ఇండియా నేరుగా చేరుతుంది. అప్పుడు న్యూజిలాండ్‌పై శ్రీలంక 2-0 తేడాతో సిరీస్ విజయం సాధించినా భారత్‌కు ఎలాంటి ఇబ్బంది ఉండదు.
- ఒకవేళ నాలుగో టెస్టులో ఓడినా భారత్‌కు ఫైనల్ అవకాశం ఉంటుంది. కానీ, న్యూజిలాండ్ చేతిలో శ్రీలంక ఒక్క టెస్టు ఓడినా చాలు. అలాగే సిరీస్ డ్రా అయినా భారత్‌కు తిరుగుండదు. రెండు టెస్టులూ డ్రా అయినా మనకేం సమస్య లేదు.
- భారత్, ఆసీస్ నాలుగో టెస్టు జరుగుతున్న తీరును చూస్తే.. ఈ మ్యాచ్‌లో భారత్ ఓడిపోవడం కష్టమే. కానీ, మ్యాచ్ డ్రా అయ్యే అవకాశం ఉంది. అంటే సిరీస్ 2-1తో ముగుస్తుంది. అప్పుడు లంక కచ్చితంగా ఓ టెస్టులో ఓడిపోవాలి. తొలి టెస్టులోనే కివీస్ గెలిచేస్తే రెండో టెస్టు ఫలితంపై మన ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ బెర్తు ఆధారపడి ఉండదు.
ఇవీ చదవండి: