భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతోన్న నాలుగు టెస్టుకు వేదికైంది ఓవల్. అయితే టీమ్ఇండియా.. సరిగ్గా 50 ఏళ్ల క్రితం ఇంగ్లీష్ గడ్డపై తొలి టెస్టుతో పాటు సిరీస్ గెలిచింది ఈ మైదానంలోనే. 1971లో జరిగిన ఈ మ్యాచ్ భారత క్రికెట్లో మరపురాని మధుర జ్ఞాపకంగా మిగిపోయింది. అయితే ఈ మ్యాచ్‌లో భారత్ గెలవడానికి ఓ ఏనుగు, గుర్రం కూడా సాయం చేశాయని ఎవరికైనా తెలుసా?.. అవును మీరు విన్నది నిజమే. ఈ మ్యాచ్‌లో టీమ్ఇండియా విజయానికి ఏనుగు, గుర్రం కూడా కారణమని భావిస్తుంటారు. అదెలాగో తెలుసుకుందాం.
ఏం జరిగింది?
ఆగస్టు 24, 1971, ఓవల్ మైదానం. అప్పటికే తొలి రెండు టెస్టులు డ్రాగా ముగియడం వల్ల చివరిదైన టెస్టులో గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలన్న లక్ష్యంతో భారత్-ఇంగ్లాండ్ బరిలో దిగాయి. ఈ మ్యాచ్ మధ్యలోనే కొందరు అభిమానులు చెస్సింగ్టన్ జూ నుంచి బెల్లా అనే ఏనుగును మైదానానికి తీసుకొచ్చారు. అందుకు కారణం ఆ సమయంలో వినాయక చవితి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఏనుగును శుభ సూచకంగా భావించిన ఫ్యాన్స్.. టీమ్ఇండియా గెలుపు కోసం దానికి తీసుకొచ్చారు.
ఈ ఏనుగు వల్లే జట్టులో ఏదో పాజిటివ్ ఎనర్జీ కనిపించిందని చెబుతారు మాజీ స్పిన్నర్ భగవత్ చంద్రశేఖర్. చిన్నప్పుడే పోలియో బారినపడిన ఆయన తన డిఫరెంట్ యాక్షన్‌తో ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో 38 పరుగులకే 6 వికెట్లు తీసి టీమ్ఇండియా విజయంలో కీలకపాత్ర పోషించారు.
గుర్రం కూడా కారణమే!
ఇదే మ్యాచ్‌లో భారత్ గెలవడానికి గుర్రం కూడా కారణమైందట. ఈ విషయాన్ని స్పిన్నర్ చంద్రశేఖర్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
"నేను బౌలింగ్ చేసేందుకు రన్నప్‌లో ఉన్నా. అప్పుడే 'హే చంద్ర అతడికి మిల్ రీఫ్ బంతిని విసురు' అంటూ దిలీప్ సర్దేశాయ్ అరుస్తున్నాడు. వెంటనే నేను దాన్ని అమలు చేశా. వికెట్ లభించింది. మొదట నేను అతడికి గూగ్లీ వేద్దామనుకున్నా. కానీ దిలీప్ మ్యాచ్‌ను క్షుణ్ణంగా చదవగలడు. అందువల్ల అతడి చెప్పిన ప్లాన్ ప్రకారం ఎడ్రిచ్కు బంతి విసరడం వల్ల బ్యాట్ లేపకముందే బంతి వెళ్లి స్టంప్స్‌ను గిరాటేసింది" అంటూ చెప్పుకొచ్చారు చంద్రశేఖర్.
మిల్ రీఫ్ అంటే?
మిల్ రీఫ్ అనేది ఓ గుర్రం. 1971లోని ఎప్సన్ డెర్బీతో పాటు చాలా గుర్రపు పందేల్లో ఇది విజేతగా నిలిచింది. అత్యంత వేగవంతమైన గుర్రంగా పేరు గాంచింది. అంటే ఇంతకుముందు దిలీప్.. చంద్రశేఖర్‌కు వేగంగా బంతి విసరమని పరోక్షంగా చెప్పాడన్నమాట.
మ్యాచ్ జరిగింది ఇలా!
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 355 పరుగులకు ఆలౌటైంది. బిషన్ సింగ్ బేడీ 5, ఏక్‌నాత్ సోల్కర్ 4 వికెట్లతో రాణించారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఇండియా 284 పరుగులకు ఆలౌటై.. ఇంగ్లీష్ జట్టుకు 71 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని అప్పగించింది. తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో 38 పరుగులకే 6 వికెట్లు తీసి ఇంగ్లాండ్ 101 పరుగులకే పరిమితమవడంలో కీలకపాత్ర పోషించాడు స్పిన్నర్ చంద్రశేఖర్. దీంతో రెండో ఇన్నింగ్స్‌లో 173 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన భారత జట్టు 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఇంగ్లాండ్‌లో చారిత్రక టెస్టు సిరీస్ విజయాన్ని సాధించింది.