టీ20 ప్రపంచకప్(T20 World Cup 2021) కోసం జట్టును ప్రకటించింది భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI). ఈ జట్టుకు మెంటార్‌గా టీమ్ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీని(Dhoni Mentor) నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని స్వాగతించాడు భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్(Sunil Gavaskar News). ఈ నేపథ్యంలో.. భారత జట్టు కోచ్ రవిశాస్త్రి, మాజీ సారథి ధోనీకి మధ్య భేదాభిప్రాయాలు తలెత్తవని అభిప్రాయపడ్డాడు.
"2004లో టీమ్ఇండియా జట్టుకు మెంటార్‌గా నేను ఎంపికైనప్పుడు జాన్ రైట్(నాటి భారత జట్టు కోచ్) కాస్త దిగులుగా కనిపించారు. ఆయన స్థానాన్ని భర్తీ చేసే ఆలోచనలో నేను ఉన్నానని అనుకున్నారు. కాబట్టి మెంటార్‌కు, కోచ్‌కు ఏకాభిప్రాయాలు ఉండటం చాలా ముఖ్యం."
-సునీల్ గావస్కర్, మాజీ క్రికెటర్.
రవిశాస్త్రి, ధోనీ ఏకాభిప్రాయంతో(Coach vs Mentor in Cricket) పనిచేస్తే టీ20 ప్రపంచకప్‌లో టీమ్ఇండియా మంచి ఫలితాలు సాధిస్తుందని గావస్కర్ పేర్కొన్నాడు.
"కోచ్ అవ్వాలనే ఆసక్తి ధోనీకి లేదని రవిశాస్త్రికి తెలుసు. శాస్త్రి, ధోనీ కలిసికట్టుగా ఉంటే జట్టుకు లాభం జరుగుతుంది. ఇరువురి మధ్య భేదాభిప్రాయాలు వస్తే జట్టుపై అది తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ధోనీ మెంటార్‌గా ఉండటం వల్ల జట్టుకు ఎంతో బలం చేకూరుతుందనే చెప్పొచ్చు."